మీరేమైనా ప్రభువులా.. ఏమైనా చేయవచ్చనుకుంటున్నారా?
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:15 AM
ముంబై క్రికెట్ ఆసోసియేషన్(ఎంసీఏ) ప్రాంగణంలో ఐదు రెస్టారెంట్లను మూసివేయడంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) తీరును తప్పుపట్టింది.
మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఉద్దేశించి బాంబే హైకోర్టు వ్యాఖ్య
ముంబై, ఆగస్టు 29: ముంబై క్రికెట్ ఆసోసియేషన్(ఎంసీఏ) ప్రాంగణంలో ఐదు రెస్టారెంట్లను మూసివేయడంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) తీరును తప్పుపట్టింది. ఆయా రెస్టారెంట్లు క్వాలిటీ, పరిశుభ్రతా నిబంధనలను 88ు వరకు పాటిస్తున్నా ఎందుకు మూసివేశారని ప్రశ్నించింది. ‘‘మీరేమైనా ప్రభువులా.. ఏమైనా చేయడానికి మీకు అధికారం ఉంది అనుకుంటున్నారా..’’ అని ఎఫ్‌డీఏ అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మూసివేత ఉత్తర్వులను రద్దు చేసింది. మరోవైపు, పుణెలోని సిప్లా క్యారీయింగ్ అండ్ ఫార్వర్డింగ్ యూనిట్‌కు ఇచ్చిన ఔషధ విక్రయ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎఫ్‌డీఏ ఇచ్చిన ఆదేశాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ప్రభుత్వ సెలవు రోజున విచారణకు హాజరు కావాలని కంపెనీకి మెయిల్ పంపి, వాయిదా కోరినా పట్టించుకోకుండా అదే రోజు ఏకపక్షంగా లైసెన్స్ రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మీరు చేసే పని మంచిదే కానీ, హద్దు మీరుతున్నారు’’ అని ఎఫ్‌డీఏను మందలించింది.