రాజ్యసభకు నితిన్ నబీన్
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:31 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బిహార్ నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు...
బిహార్ నుంచి పోటీ చేయనున్న బీజేపీ అధ్యక్షుడు
పార్టీ నుంచి బరిలో మరో 8 మంది
న్యూఢిల్లీ, మార్చి 3: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బిహార్ నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లు భాజపా మంగళవారం వెల్లడించింది. వివిధ రాష్ట్రాల నుంచి బరిలో నిలిచే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో రాహుల్ సిన్హా (పశ్చిమ బెంగాల్), లక్ష్మీవర్మ (ఛత్తీస్‌గఢ్), జోగెన్ మోహన్, తెరాష్ గోవాల్లా (అస్సాం), మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్ (ఒడిశా), శివేశ్ కుమార్ (బిహార్), సంజయ్ భాటియా (హరియాణా) ఉన్నారు. వీరందరి అభ్యర్థిత్వాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. నితిన్ నబిన్ బిహార్ నుంచి రాజ్యసభకు పోటీ చేయవచ్చని గత జనవరిలో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే పార్టీ నేతలు భావించారు. ప్రస్తు తం నితిన్ బిహార్‌లోని బంకిపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతకు ముందు జేపీ నడ్డా, అమిత్‌షాలు సైతం పార్టీ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజ్యసభకు ఎన్నికయ్యారు. వచ్చే ఏప్రిల్ నెలలో విభిన్న తేదీల్లో పది రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మహారాష్ట్రలో 7, ఒడిశాలో 4, తెలంగాణలో 2, తమిళనాడులో6, ఛత్తీ్‌సగఢ్‌లో 2, పశ్చిమ బెంగాల్‌లో 5, అస్సాంలో 3, హరియాణాలో 2, హిమాచల్‌ప్రదేశ్‌లో 1, బిహార్‌లో 5స్థానాలు ఉన్నాయి.