బీజేపీ ఎజెండా దిశగా!
ABN , Publish Date - May 05 , 2026 | 06:02 AM
టార్గెట్ చేయడం.. విజయం సాధించడం! టార్గెట్ చేయడం.. విజయం సాధించడం! కొన్నేళ్లుగా బీజేపీ వ్యూహమిది! ఇందులో భాగంగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌నూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.
తాజా ఎన్నికల్లో ఐదింట మూడు కైవసం
రాజ్యసభలోనూ మెజారిటీ దిశగా పయనం
టార్గెట్ చేయడం.. విజయం సాధించడం! టార్గెట్ చేయడం.. విజయం సాధించడం! కొన్నేళ్లుగా బీజేపీ వ్యూహమిది! ఇందులో భాగంగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌నూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. నిజానికి, గతంతో పోలిస్తే.. రెండేళ్ల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు భారీగా తగ్గాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధిస్తే.. 2024 ఎన్నికల్లో 240కే పరిమితమైంది. దాంతో, టీడీపీ, జేడీయూ మద్దతుతో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లోక్‌సభలో కాస్త ఎదురు దెబ్బ తగిలినా.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కమలం అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేసింది. ఆప్‌ను మట్టి కరిపించి మరీ ఢిల్లీలో పాగా వేసింది. తాజాగా జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో మూడింటిని తన ఖాతాలో వేసుకుంది. ఇక, వచ్చే ఏడాది మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. వాటిని కాపాడుకుంటూనే పంజాబ్‌లోనూ పాగా వేయడమే బీజేపీ తదుపరి లక్ష్యం. అలాగే, దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఎత్తులు వేస్తోంది. పంజాబ్‌తోపాటు కర్ణాటక, తెలంగాణల్లోనూ ఒకవేళ బీజేపీ విజయం సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఐదింట నాలుగు వంతులు కాషాయమయమే! వెరసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును దాటుకుని కేంద్రంలో నాలుగోసారి అధికార పగ్గాలు చేపట్టడానికి బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. అంతేనా, రాజ్యసభలోనూ పూర్తి మెజారిటీ సాధించి జమిలి ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన వంటి బిల్లులను ఆమోదింపజేసుకుని తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాజా విజయాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజ్యసభలోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దక్కించుకుంటుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.