సర్‌పై ఇండియా కూటమి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ ప్రణాళిక
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:07 AM
ఓట్ చోరీపై ఇండియా కూటమి నవంబరు 1న నిర్వహించనున్న ర్యాలీని సమర్థంగా ఎదుర్కొనేందుకు... అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో..
‘అరాచకత్వం నిర్మూలన’ పేరిట జనంలోకి పార్టీ నేతలు
వరుస భేటీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి కీలక సూచనలు
న్యూఢిల్లీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఓట్ చోరీపై ఇండియా కూటమి నవంబరు 1న నిర్వహించనున్న ర్యాలీని సమర్థంగా ఎదుర్కొనేందుకు... అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాట పట్టేందుకు తగిన వ్యూహాలను రచించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సన్నద్ధమయ్యారు. ఈమేరకు వరుసగా రెండు కీలక సమావేశాలను నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో, కేంద్ర మంత్రులతో ఆయన వేర్వేరుగా భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా ‘సర్’పై ప్రతిపక్షాల దుష్పప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి- అరాచకత్వాన్ని నిర్మూలించాలి’ పేరిట పార్టీ నేతలు పెద్దఎత్తున జనంలోకి వెళ్లాలని నితీన్‌నబీన్ పిలుపునిచ్చారు. ఈ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, స్మృతి ఇరానీ, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్ పాల్గొన్నారు.
అనంతరం కేంద్ర మంత్రులతో నితీన్‌నబీన్ మరో సమావేశాన్ని నిర్వహించారు. సర్‌పై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రచారాన్ని మరింత ఉదృతం చేయడం, ప్రజలకు మరింతగా చేరువకావడం, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీజేపీ వైఖరిని ప్రజలకు వివరంగా తెలియజేయడం వంటి అంశాలపె చర్చించారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్‌సింగ్, కిరణ్ రిజిజు, అశ్వినీవైష్ణవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.