Share News

కొత్త వాళ్లకు కీలక శాఖలు!

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:19 AM

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కీలక శాఖలు కొత్తవారికి దక్కనున్నట్లు తెలిసింది.

కొత్త వాళ్లకు కీలక శాఖలు!

  • పార్లమెంటు సమావేశాల్లోపే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 28: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కీలక శాఖలు కొత్తవారికి దక్కనున్నట్లు తెలిసింది. అయితే మొదట బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కొత్త జట్టును ప్రకటిస్తారని.. తదనుగుణంగా మోదీ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అత్యున్నత స్థాయి బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. నితిన్‌ నబీన్‌ టీంను పార్టీ అగ్ర నేతలు ఖరారు చేశారని.. కీలక సంస్థాగత పదవుల్లో యువతకు పెద్దపీట వేయనున్నారని తెలిపాయి. నబీన్‌ గత వారం కొంతమంది కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపారు. వీరిలో కొందరిని పార్టీలోకి తీసుకోనున్నారు. పార్టీ ఆఫీసు బేరర్లలో కొందరిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ, సీబీఎ్‌సఈ డిజిటల్‌ మార్కింగ్‌ సిస్టమ్‌లో అవకతవకలు మొదలైన వాటి నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొందరు సీనియర్ల శాఖల్లో మార్పుచేర్పులు జరుగవచ్చని అంటున్నారు. కీలక శాఖలకు యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని బీజేపీ అగ్ర నాయకత్వం దృఢంగా భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక రాజకీయ అవసరాల దృష్ట్యా ప్రాంతీ య, రాష్ట్ర, కుల, వర్గాలకు క్యాబినెట్‌లో ప్రాధాన్యమివ్వాలని అనుకుంటోంది. జూలై మూడో వా రంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈలోపే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రధాని మోదీ షెడ్యూల్‌ చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం సీషెల్స్‌లో పర్యటిస్తున్న ఆయన.. జూలై 6-11 తేదీల నడుమ ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించాల్సి ఉంది. జూలై 1-3 మధ్య జపాన్‌ ప్రధాని ఎస్‌.తకాయిచీ ఢిల్లీలో పర్యటించనున్నారు.


ఒకరికి ఒకే పదవి..

కేంద్ర మంత్రులు పంకజ్‌ చౌధురి, హర్ష్‌ మల్హోత్రాకు ఇప్పటికే యూపీ, ఢిల్లీ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఒకరికి ఒకే పదవి అన్న సూత్రం ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణలో వీరికి ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21న ముగిసినా.. కేంద్ర మంత్రు లు జార్జి కురియన్‌, రవనీత్‌సింగ్‌ బిట్టూలకు రెండోసారి అవకాశమివ్వలేదు. దీంతో కురియన్‌ రాజీనామా చేశారు. పంజాబ్‌ మాజీ సీఎం సర్దార్‌ బియాంత్‌సింగ్‌ మనవడైన బిట్టూ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చారు. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జాట్‌ తెగకు చెందిన బిట్టూ కీలక నేత కావడంతో ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలే ఎక్కువని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఎక్కువ మంది మంత్రులను నియమిస్తారని అంటున్నారు. అలాగే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం దరిమిలా.. కేంద్ర మంత్రివర్గంలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టీఎంసీ, శివసేన(యూబీటీ) రెబెల్స్‌కు చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. 20మంది టీఎంసీ రెబెల్‌ ఎంపీలు బెంగాల్లోని నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతామని ప్రకటించారు. ఆరుగురు యూబీటీ రెబెల్‌ ఎంపీలు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే సారథ్యంలోని శివసేనలో విలీనమయ్యారు. ఈ పార్టీ సీనియర్‌ నేతకు కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఫిరాయింపు నిరోధక చట్టంకింద లోక్‌సభ స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చాకే ఈ రెబెల్‌ ఎంపీలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే పంజాబ్‌, ఢిల్లీకి చెందిన ఏడుగురు ఆప్‌ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో స్థానం లభించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరో ఇద్దరు కేంద్రమంత్రులు హర్‌దీ్‌పసింగ్‌ పురీ, బీఎల్‌ వర్మల రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది నవంబరులో ముగియనుంది. ఇక ముగ్గురు గవర్నర్లు థావర్‌చంద్‌ గహ్లోత్‌ (కర్ణాటక), మంగూభాయ్‌ పటేల్‌ (మధ్యప్రదేశ్‌) జూలైలో, లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌సింగ్‌ (ఉత్తరాఖండ్‌) సెప్టెంబరులో రిటైర్‌ కానున్నారు. వీరికి కొనసాగింపు ఉంటుందా.. లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది చూడాలి. కొందరు ప్రస్తుత మంత్రులను గవర్నర్లుగా నియించే అవకాశాలూ ఉన్నాయని బీజేపీ సీనియర్లు చెబుతున్నారు.

Updated Date - Jun 29 , 2026 | 04:19 AM