Share News

80 సీట్లు.. ఉపముఖ్యమంత్రి పదవి!

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:38 AM

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్‌డీఏతో పొత్తు లేనేలేదని సినీ హీరో, టీవీకే అధినేత విజయ్‌ పదే పదే చెబుతున్నప్పటికీ..

80 సీట్లు.. ఉపముఖ్యమంత్రి పదవి!

  • తమిళనాట హీరో విజయ్‌కు బీజేపీ ఆఫర్‌?

  • అదేమీ లేదంటున్న టీవీకే వర్గాలు

  • అన్నాడీఎంకే నేత పళనిసామిదీ అదే మాట

చెన్నై, మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్‌డీఏతో పొత్తు లేనేలేదని సినీ హీరో, టీవీకే అధినేత విజయ్‌ పదే పదే చెబుతున్నప్పటికీ.. బీజేపీ, టీవీకే మధ్య చర్చలు సాగుతున్నాయని.. అవి తుది అంకానికి చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తం రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య 234 కాగా.. టీవీకేకు 80 ఇస్తామని.. విజయ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఆయన సీఎం పదవి కోరుతున్నారని, చర్చల్లో ఇదే కీలకంగా మారినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాలక డీఎంకే నేతృత్వంలోని కూటమికి, అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏకి మధ్య గట్టి పోటీ ఉందని.. ఓట్ల శాతంలో కాస్త తేడా వచ్చినా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. విజయ్‌తో పొత్తుకు తెరవెనుక వివిధ మార్గాల్లో పనిచేస్తోందని అంటున్నాయి. ఈ వార్తలు విజయ్‌కు అత్యంత సన్నిహితులు, సలహాదారులుగా ఉన్నవారికి కూడా మింగుడుపడడం లేదు. ఇది కొత్త పార్టీ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. స్వీయ ఇమేజ్‌తో రాజకీయ ప్రవేశం చేసిన విజయ్‌.. తమిళనాడు రాజకీయాల్లో తన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా చూపిస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో మరీ ఇంత త్వరగా ఎన్డీఏలో చేరితే.. ప్రతికూలత ఎదురుకావచ్చని వారు అంటున్నట్లు సమాచారం. మరోవైపు, విజయ్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్‌ ఎడప్పాడి పళనిసామి మరోసారి స్పష్టంచేశారు.

Updated Date - Mar 16 , 2026 | 03:38 AM