అసోంలో తీన్‌మార్!
ABN , Publish Date - May 05 , 2026 | 05:20 AM
ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మరోసారి బీజేపీ గుబాళించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టింది....
ఈశాన్య రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి బీజేపీ
గువహటి, మే 4: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మరోసారి బీజేపీ గుబాళించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన స్థానాలకు మించి ఓట్లు, సీట్లు సాధించి విజయ దుందుభి మోగించింది. మొత్తంగా 126 అసెంబ్లీ స్థానల్లో 101 సీట్లలో ఎన్టీయే కూటమి గెలుపొందింది. సీఎం బిశ్వశర్మ జలుక్‌బారి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎన్నికయ్యారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్‌పై ఆయన 89,434 ఓట్ల అధిక్యంతో ఘన విజయం సాధించారు. బీజేపీ, అసోం గణపరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీఆర్‌ఎఫ్) కూటమి అయిన ఎన్డీయే అప్రతిహత ఆధిక్యాన్ని కనబర్చింది. బీజేపీ 90 స్థానాల్లో, ఏజీపీ 26 స్థానాల్లో, బోడోలాండ్ 11 స్థానాల్లో పోటీచేశాయి. బీజేపీ 81 స్థానాల్లో విజయం సాధించగా, ఏజీపీ, బీఆర్‌ఎఫ్ 10 సీట్ల చొప్పున కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని అసోం సమ్మిళిత్ మోర్చా (ఏఎస్‌ఎం) 21 సీట్లకే పరిమితమైంది. 99 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 మాత్రమే గెలుచుకుంది. కాగా అసోంలో 15ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ 2016లో బీజేపీ కూటమి విజయం సాధించింది. అప్పట్లో సర్బానంద సోనోవాల్ సీఎం అయ్యారు. 2021లోనూ ఆ పార్టీ కూటమి విజయం సాధించింది.
కలిసొచ్చిన ‘అరుణోదయ’
ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, దివ్యాంగులైన మహిళలు, 45 ఏళ్లు నిండిన అవివాహిత మహిళలకు నెలకు రూ.1250 చొప్పున సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఆరుణోదయ’ పథకాన్ని హిమంత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుండటం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఈ పథకం ద్వారా 38లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. ఆ రాష్ట్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 1.6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో యువత ఆ పార్టీవైపే నిలిచారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికడతామనే హామీలు జనాల్లోకి బలంగా వెళ్లాయి. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న 1281 మదర్సాలను మార్చేసి వాటిని ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావడం, బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ విక్రయాలను, తినడాన్ని నిషేధించడం వంటి చర్యలు మెజారిటీ వర్గం ఓటర్లపై సానుకూల ప్రభావం చూపాయి. కాగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో 23,182 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాంగ్రెస్‌కు అసమ్మతి దెబ్బ
అసోం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన భూపేన్ బోరా ఎన్నికలకు కొన్నినెలల ముందు బీజేపీలోకి మారారు. ఆయన మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళ్లడం ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీసింది. టికెట్ల కేటాయింపులో గందరగోళం, మిత్రపక్షాలతో సమన్వయలోపం, మైనారిటీ ఓట్లలో చీలిక, నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా మారిన ఓట్ల సమీకరణాలు ఆ పార్టీకి శరాఘాతంగా పరిణమించాయి. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఫలితాలు శాసించేలా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య 35 నుంచి 25కు తగ్గిందని, ఫలితంగా కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ అవకాశాలు దెబ్బతిన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.