పెద్దఎత్తున జనంలోకి బీజేపీ!
ABN , Publish Date - May 24 , 2026 | 04:13 AM
కేంద్రంలో మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ, కేంద్రం పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి.
5 థీమ్‌లు.. 22 అంశాలు
జాతీయ స్థాయిలో బ్లూప్రింట్ సిద్ధం
న్యూఢిల్లీ, మే 23: కేంద్రంలో మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ, కేంద్రం పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. ప్రధానంగా సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. సమన్వయంతో విలేకరుల సమావేశాలు, బహిరంగ సభలు, మీడియాతో ముఖాముఖి నిర్వహించి.. సత్పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, జాతీయ భద్రత తదితర అంశాల్లో పురోగతిని ప్రజలకు వివరిస్తారు. ఆయా శాఖల మంత్రులు తమ రిపోర్టు కార్డులను వారి సమక్షంలోనే విడుదల చేస్తారు. ‘లోక్‌సేవ’, ‘సశక్తీకరణ్’, ‘రాష్ట్ర నిర్మాణ్’, ‘రాష్ట్ర్ ప్రథమ్’, ‘విరాసత్ భీ.. వికాస్ భీ’ అనే ఐదు విస్తృత థీమ్‌లతో 22 ప్రాధాన్య అంశాల చుట్టూ బీజేపీ ప్రచారం నడుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
లోక్‌సేవ: పేదలు, రైతులు, మధ్యతరగతి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆరోగ్య సేవలు.
సశక్తీకరణ్: మహిళాసాధికారత, యువతకు అవకాశాలు, బలహీన వర్గాల సంక్షేమానికి, రైతుల బలోపేతానికి చర్యలు, కార్యక్రమాలు.
రాష్ట్రనిర్మాణ్: ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తృతి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈశాన్య భారత అభివృద్ధి.
రాష్ట్ర్ ప్రథమ్: జాతీయ భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు. ప్రధానంగా విదేశాంగ విధానం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, నక్సలిజం అణచివేత కార్యక్రమాలు.
విరాసత్ భీ.. వికాస్ భీ: సంస్కృతి, వారసత్వ సంరక్షణ, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ.
సమన్వయంతో క్షేత్ర స్థాయికి..
వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీలకు, ద్వితీయార్థంలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే 2027 జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇవిగాక పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓటర్ల వద్దకు పెద్దఎత్తున వెళ్లేలా.. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో ప్రచారంలో నిమగ్నం కావాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ప్రతి మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను సమన్వయంతో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీనియర్ నేతలకు కీలక రాష్ట్రాలను అప్పగించారు. మంత్రులు పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు మీడియా సమావేశాలతో పాటు జిల్లా స్థాయిలోనూ డ్రైవ్‌లు చేపడతారు. మేధావులతో సమావేశాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా భేటీల వంటివి ఉంటాయని బీజేపీ నేతలు వెల్లడించారు.