Share News

ఇండీ ర్యాలీకి పోటీగా.. హస్తినలో నేడు బీజేపీ మార్చ్‌!

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:49 AM

‘సర్‌’ ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమిపై బీజేపీ కూడా నేరుగా దాడి మొదలుపెట్టింది.

ఇండీ ర్యాలీకి పోటీగా.. హస్తినలో నేడు బీజేపీ మార్చ్‌!

  • 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులతో రోడ్డెక్కాలని నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 31: ‘సర్‌’ ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమిపై బీజేపీ కూడా నేరుగా దాడి మొదలుపెట్టింది. విపక్ష కూటమి ఆదివారం తలపెట్టిన ర్యాలీకి పోటీగా ఢిల్లీలో తాను కూడా భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్య జరిగిన మర్నాడు.. అంటే నవంబరు 1న ఢిల్లీ వీధుల్లో సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో దమనకాండ సాగింది. ఇప్పుడు ఇదే రోజు విపక్షాలు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో.. దానికి కౌంటర్‌ ఇవ్వాలని బీజేపీ నిశ్చయించింది. విస్తృత స్థాయిలో భారీ మార్చ్‌ తలపెట్టింది. దమనకాండ బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. అలాగే వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున.. భారీగా సిక్కు నేతలు కూడా మార్చ్‌కు హాజరయ్యేలా చూడాలని క్షేత్ర స్థాయి నేతలకు ఆదేశాలు వెళ్లాయి. తద్వారా నాటి అల్లర్లలో కాంగ్రెస్‌ నేతల పాత్ర మరోసారి వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. కన్నాట్‌ ప్లేస్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రగా బయల్దేరి రామ్‌లీలా మైదానం చేరాలని కాంగ్రెస్‌ బ్లూప్రింట్‌ సిద్ధంచేయగా.. ఉదయం 11 గంటలకే హరినగర్‌ నుంచి ర్యాలీ ప్రారంభించాలని బీజేపీ యోచిస్తోంది.

Updated Date - Nov 01 , 2026 | 02:51 AM