అకోయిజంను ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:32 AM
విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంను కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.
లైంగిక వేధింపుల నిందితుడిని కాంగ్రెస్ కాపాడుతోంది: బీజేపీ మహిళా మోర్చా
ఢిల్లీలో ఇందిరాభవన్ ఎదుట ఆందోళన
న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంను కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. తక్షణమే ఆ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేసింది. సోమవారం, ‘నారీ శక్తి హుంకార్ ఆందోళన్’ పేరిట బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రూపకుమారి, ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో ఎంపీలు, మహిళా ప్రతినిధులు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విచారణ కమిటీ తేల్చినా.. చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పితృస్వామ్యాన్ని అంతం చేయాలని ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్‌గాంధీ, ‘నేను అమ్మాయిని.. పోరాడగలను’ అని నినదించే ప్రియాంక గాంధీ వాద్రా.. తమ పార్టీ ఎంపీ ఘోరానికి ఒడిగడితే ఎందుకు నోరు మెదపడం లేదని పురందేశ్వరి ప్రశ్నించారు.