Share News

బెంగాల్‌లో పాగాకుబీజేపీ విశ్వయత్నాలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:29 AM

దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కానీ.. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే ప్రధాని మోదీ, పార్టీ కార్యకర్తల మోముపై దరహాసం కనిపిస్తుంది....

బెంగాల్‌లో పాగాకుబీజేపీ విశ్వయత్నాలు

  • హిందూ ఓట్లు సంఘటితమైతేనేకమల వికాసం: విశ్లేషకులు

(ఆంధ్రజ్యోతి-న్యూఢిల్లీ)

‘‘దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కానీ.. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే ప్రధాని మోదీ, పార్టీ కార్యకర్తల మోముపై దరహాసం కనిపిస్తుంది’’ ..పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఒక సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పిన మాట ఇది!! అవేవో యథాలాపంగా చెప్పిన మాటలు కావు! నిజంగానే.. పదిహేనేళ్లుగా మమత కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్‌పై కాషాయ జెండా ఎగరేయడానికి కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2016లో కేవలం 3 సీట్లు సాధించిన బీజేపీ.. 2021లో టీఎంసీతో ‘అమీ తుమీ’ అన్నట్టుగా పోరాడి 77 సీట్లకు ఎగబాకింది!! ఆ ఊపుతోనే.. ఈసారి మరిన్ని ఓట్లు, సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకోవాల్సిందే అనే పట్టుదలతో కమలనాథులు పనిచేస్తున్నారు! విజయం సాధించడం కోసం సామ, దాన, భేద, దండోపాయాలన్నింటినీ వాడేస్తున్నారు. విస్తృతస్థాయిలో ఓటర్ల జాబితాను సవరించడం, ఎన్నికలకు కొన్నిరోజుల ముందు గవర్నర్‌తో రాజీనామా చేయించి తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేయడం వంటి పరిణామాలు ఇందుకు ఉదాహరణలు. అంతేనా.. రెండు రోజుల ఆ రాష్ట్ర సీఎస్‌ను, ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. అక్రమ కాల్‌ సెంటర్‌ ఆపరేషన్లపై దర్యాప్తుల పేరుతో బెంగాల్‌లోని సిలిగురి, హౌరా, బిధాన్‌ నగర్‌, దుర్గాపూర్‌లతోపాటు పలు చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. అయితే ఇలాంటివి ఎన్ని చేసినా.. 30 శాతానికి పైగా ముస్లిం ఓట్లున్న బెంగాల్‌లో హిందూ ఓట్లు సంఘటితం కానంతవరకూ బీజేపీ విజయం సాధించడం కష్టమని రాజకీయవర్గాలు అంటున్నాయి. బీజేపీ ఈసారి మరింత పుంజుకున్నప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు సాఽధిస్తుందని ఇటీవల నిర్వహించిన ఒక ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ 155 నుంచి 170 సీట్లు, బీజేపీ 100 నుంచి 115 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఆ పోల్‌లో తేలింది. కానీ, బెంగాల్‌లో కోస్తా జిల్లా అయిన పర్బా మేదినీపూర్‌లో బీజేపీకి 2021 ఎన్నికల్లో 16 స్థానాలకుగాను 7 స్థానాలు గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిక్యం సాఽధించింది. మత్స్యకారులను, రైతులను తన వైపునకు తిప్పుకొంటూ తీర ప్రాంతాల్లో ఓటు బ్యాంకును స్థిరపరుచుకోవడమే ఇందుకు కారణం. తీర ప్రాంతంలోనే కాదు.. జంగల్‌ మహల్‌ గిరిజన ప్రాంతంలో కూడా బీజేపీ పట్టు సాధించింది. అలాగే.. గత ఎన్నికల్లో టీఎంసీ 5 శాతం అంతకంటే తక్కువ మార్జిన్‌తో గెలిచిన 46 స్థానాలపె బీజేపీ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈసారి ఎలాగైనా ఆ స్థానాలను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


గెలుస్తామనే ధీమా..

పదిహేను సంవత్సరాల క్రితం వామపక్ష కోటను తృణమూల్‌ కూల్చినట్లే ఇప్పుడు మమతా బెనర్జీ కోటను తాము కుప్పకూలుస్తామని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు పట్ల ప్రజా వ్యతిరేకత, ముస్లిం బుజ్జగింపు ధోరణులు, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ప్రజలు, హిందూ ఓట్లు సంఘటితం కావడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు మమత ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. పదో తరగతి పాస్‌ అయిన వారికి యువసాథీ పేరిట స్టైపెండ్‌ ప్రకటించడం, మహిళలకు లక్ష్మీభండార్‌ పథకం క్రింద కేటాయింపులు పెంచడం, ఎన్నికల షెడ్యూలు విడుదల కావడానికి కొన్నిగంటల ముందు ప్రభుత్వోద్యోగులకు డీఏ పెంచడం, హిందూ పూజారులకు, ముస్లిం మతాధికారులకు గౌరవవేతనం 33ు పెంచడం వంటి చర్యలతో ప్రజల మనసును దీదీ చూరగొన్నారనడంలో అతిశయోక్తి లేదు.

Updated Date - Mar 18 , 2026 | 06:06 AM