Share News

రాజ్యసభలో సెంచరీ దాటిన బీజేపీ బలం

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:02 AM

పార్లమెంట్‌ ఎగువ సభలోనూ బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. లోక్‌సభలో ఇప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ, ఇప్పుడు రాజ్యసభలోనూ పెద్దన్నగా ఎదిగింది.

రాజ్యసభలో సెంచరీ దాటిన బీజేపీ బలం

న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎగువ సభలోనూ బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. లోక్‌సభలో ఇప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ, ఇప్పుడు రాజ్యసభలోనూ పెద్దన్నగా ఎదిగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, తెలంగాణ సహా 10 రాష్ట్రాలలో జరిగిన ఈ ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తన సత్తా చాటింది. ఖాళీ అయిన 37 స్థానాలలో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. మొత్తంగా 37 స్థానాల్లో 24 చోట్ల ఎన్డీయే విజయం సాధించడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 106కు చేరింది. ఒడిశా, హర్యానా, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సరళి కూటమికి అనుకూలంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్షాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు, వ్యూహకర్తల వైఫల్యం అధికారపార్టీకి కలిసివచ్చాయి. క్రాస్‌ ఓటింగ్‌, విపక్ష సభ్యుల గైర్హాజరీ వంటి అంశాలు ఎన్డీయేకు కలిసివచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 11 స్థానాల్లో.. ఏకంగా తొమ్మిదింటిని ఎన్డీఏ కైవసం చేసుకోవడం గమనార్హం. తాజా విజయాలతో రాజ్యసభలో ఎన్డీయే కూటమి బలం 141కి పెరిగింది. ఇందులో బీజేపీ (106) తర్వాత ఏఐఏడీఎంకే (5), జేడీయూ(4), ఎన్సీపీ(4)పార్టీలు ప్రధాన బలంగా ఉన్నాయి. టీడీపీ, శివసేన చెరి రెండు స్థానాలను కలిగి ఉండగా.. మరో ఏడుగురు నామినేటెడ్‌ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికే ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామంతో లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ సాధారణ బిల్లులను ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి నల్లేరుపై నడకే కానుంది. ఇక, విపక్ష కూటమిలో కాంగ్రెస్‌ తన బలాన్ని 29కి పెంచుకోగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ 13, ఆమ్‌ ఆద్మీ పార్టీ 10 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఎగువ సభలో ఎన్డీఏ బలం పెరిగినప్పటికీ, జమిలి ఎన్నికలు వంటి కీలక రాజ్యంగా సవరణలను చేపట్టడం మోదీ ప్రభుత్వానికి ఇంకా సవాలుగానే ఉంది.

Updated Date - Mar 18 , 2026 | 04:02 AM