సీజేపీ నిరసన ఓ ‘ఫ్లాప్ షో’
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:47 AM
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిర్వహించిన నిరసన ప్రదర్శన ‘ఫ్లాప్ షో’ అని బీజేపీ ఎద్దేవా చేసింది.
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా
న్యూఢిల్లీ, అక్టోబరు 10: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిర్వహించిన నిరసన ప్రదర్శన ‘ఫ్లాప్ షో’ అని బీజేపీ ఎద్దేవా చేసింది. ఢిల్లీలో మూకస్వామ్యం ఓడిపోయిందని, ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్యానించింది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో వాళ్లు హింసాత్మక ఘటనలకు పాల్పడాలని చూశారు. కానీ, విఫలమయ్యారు. ఢిల్లీ ప్రశాంతంగా, పూర్తిగా నియంత్రణలో ఉంది’’ అని తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద జరిగే వ్యవహారాలు భారతదేశ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని సంబిత్ పాత్రా అన్నారు. దేశం ఎంతో శాంతియుతంగా ఉందని, సుపరిపాలనతో పురోగమిస్తోందని చెప్పారు. ఈ నిరసనల ద్వారా దేశ రాజధానితో పాటు యావత్ దేశాన్ని బందీగా చేసే ప్రయత్నం జరిగిందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో స్టార్ లింక్ సేవలకు సంబంధించిన వ్యవహారంలో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ స్వాగతించడంపై సంబిత్ పాత్రా మండిపడ్డారు. 1757లో బ్రిటిష్ వారితో చేతులు కలిపిన మీర్ జాఫర్‌తో రాహుల్‌ను పోల్చారు. ‘‘రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో కుమ్మక్కై దేశమంతటా అరాచకత్వాన్ని వ్యాపింపజేయాలని చూస్తున్నారు’’ ఆరోపించారు. మరోవైపు, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, సీజేపీలు విదేశీ శక్తుల మద్దతుతో దేశాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తున్న నిరసనల కోసం సీజేపీకి ఎక్కడి నిధులు వస్తున్నాయని, తెర వెనుక ఉండి ఈ ఆట ఆడిస్తున్న వ్యక్తులు ఎవరని వీహెచ్‌పీ ప్రశ్నించింది.