తమిళనాడుఎన్నికల్లో పోటీకి అన్నామలై దూరం!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:45 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎట్టకేలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. ముందుగా బీజేపీ 27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ
చెన్నై, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎట్టకేలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. ముందుగా బీజేపీ 27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ అవినాశి నియోజకవర్గం నుంచి పోటీచేయనుండగా.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఎన్నికల బరిలోకి దిగుతారని మొదట ప్రచారం జరిగినా.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనను ప్రచార బాధ్యతల నుంచి మినహాయించాలని ఆయన పార్టీని కోరినట్లు సమాచారం. పోటీ చేసే అవకాశం కల్పించాలని తాను కోరలేదని అన్నామలై మార్చిలోనే చెప్పారు. గత తమిళనాడు ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. కూటమి సీట్ల పంపకంలో భాగంగా ఈసారి 27 చోట్ల బరిలోకి దిగుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా 27 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, మేలూరు నియోజకవర్గ అభ్యర్థి పేరు వెల్లడించాల్సి ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై యధావిధిగా శ్రీపెరంబుదూర్ నుంచే పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి.