Maharashtra Municipal Elections: బీజేపీ సేన ‘మహా’ విజయం
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:35 AM
మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలోని 29 మునిసిపల్ కార్పొరేషన్లకుగాను25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది.
మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో భారీ గెలుపు.. 29 కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం
ముంబైలో మహాయుతి కూటమి పాగా
హైదరాబాద్/ముంబై, జనవరి 16: మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలోని 29 మునిసిపల్ కార్పొరేషన్లకుగాను25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది. గత 25 ఏళ్లుగా ఉమ్మడి శివసేననే ఇక్కడ అధికారం చెలాయిస్తూ వచ్చింది. తాజా ఫలితాల్లో ఇక్కడ సొంతంగా మెజారిటీ సాధించకపోయినా, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 88 వార్డులు గెలిచింది. రెండోస్థానంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నిలిచింది. ఈ పార్టీ 67 చోట్ల విజయం సాధించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 28 వార్డులు గెలిచి మూడో పెద్దపార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 24, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎ్‌స) 6, ఎన్సీపీ 3, ఎన్సీపీ (ఎస్‌పీ) 1 చోట, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. దేశ ంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన బీఎంసీలో 227 వార్డులు ఉన్నాయి. మెజారిటీ మార్కు 114. బీజేపీ, శివసే, ఎన్సీపీలకు వచ్చిన సీట్లు కలిపితే మెజారిటీ మార్కు లభిస్తుంది.. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఎక్కువశాతం మహాయుతి కూటమే గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 2,869 వార్డులు ఉండగా, బీజేపీ 1,440, శివసేన 404, కాంగ్రెస్ 318, శివసేన (యూబీటీ) 156, ఎన్సీపీ 164, ఎన్సీపీ (ఎస్పీ) 36, ఎంఎన్‌ఎస్ 14, వీబీఏ 15, ఇతరులు 322 చోట్ల గెలిచారు. బీజేపీ గెలుపుపై ప్రధానిమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ ఫలితాలే కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ పనితీరుకు దక్కిన మద్దుతు అని అన్నారు. కాగా, తమిళనాడు బీజేపీ నేత అన్నామలై బీఎంసీలో ప్రచారం చేసిన మూడుచోట్ల బీజేపీ విజయం సాధించింది.
ఫలితమివ్వని పునరేకీకరణలు
ఈ ఎన్నికల కోసం రెండు ప్రధాన పార్టీల్లోని చీలిక వర్గాలు చేతులు కలిపాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎ్‌స) అధినేత రాజ్ ఠాక్రే కలిసిపోయారు. అలాగే అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ), శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) వర్గాలు కూడా కలిసిపోయాయి. అయినా, ఎన్నికల్లో వీరు ప్రభావం చూపలేకపోయారు. మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 112 మంది గెలిచినట్లు మజ్లిస్ పార్టీ ప్రకటించింది. కాగా, ఈ ఎన్నికల్లో ఈసీ బీజేపీ, శివసేనకు అనుకూలంగా వ్యవహరించిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
హిందీనా..? ఇది మహారాష్ట్ర భాయ్..!: అమీర్‌ఖాన్
ముంబైలో గురువారం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఓటువేసేందుకు ఓ పోలింగ్ కేంద్ర వ ద్ద ఓటర్ల వరుసలో నిలుచోగా.. ఆయనను మీడియా పలకరించింది. దీంతో ‘ప్రజలంతా వచ్చి తమ విలువైన ఓటును వినియోగించుకోండి’ అని ఆయన మరాఠీలో పిలుపునిచ్చారు. మీడియా ప్రతినిధులు అదే విషయాన్ని హిందీలో చెప్పాలని కోరగా.. ‘హిందీలోనా? ఇది మహారాష్ట్ర భాయ్..’ అని బదులిచ్చారు. ఈ సందేశం ఢిల్లీలో కూడా ప్రసారం అవుతుందని చెప్పగా.. చివరకు ఆయన ఇంగ్లి్‌షలో తన సందేశాన్ని ఇచ్చారు.
గౌరీలంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు
కర్ణాటకకు చెందిన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీలంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పంగార్కర్ మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో గెలుపొందాడు. జాల్నా మునిసిపల్ కార్పొరేషన్‌లోని 13వ నంబర్ వార్డులో అతడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. శుక్రవారం వెళ్లడైన ఫలితాల్లో 2,661 ఓట్లు సాధించిన శ్రీకాంత్.. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రావ్‌సాహెబ్ ధోల్బేను ఓడించారు. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటిముందే గౌరీ లంకేశ్‌ను దుండగులు కాల్చి చంపారు.