Share News

17 ఏళ్లుగా జైల్లో ఉన్నారు.. బెయిల్‌ ఇస్తున్నాం!

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:42 AM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2002 నాటి బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల ఊచకోత కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

17 ఏళ్లుగా జైల్లో ఉన్నారు.. బెయిల్‌ ఇస్తున్నాం!

  • జీవితకాల జైలు శిక్షనూ సస్పెండ్‌ చేస్తున్నాం

  • వెంటనే వారిని విడుదల చేయండి

  • బిల్కిస్‌బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

  • దోషుల్లో ఒకరు వైకల్యంతో బాధపడుతున్నారు

  • వారి పిటిషన్‌లో వాస్తవాలు, చట్టపరమైన అంశాలను పరిశీలిస్తాం: న్యాయమూర్తులు

  • వారు ఘోరం చేశారు.. బెయిలివ్వొద్దు: సర్కార్‌

న్యూఢిల్లీ, నవంబరు 16: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2002 నాటి బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల ఊచకోత కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాదు, వారికి విధించిన జీవిత ఖైదును కూడా నిలిపివేసింది. ఈ కేసులో దోషులు బిపిన్‌చంద్ర జోషి, ప్రదీప్‌ మోధియాలు ఇప్పటికే 17 ఏళ్లకుపైగా జైల్లో ఉన్నారని వారిలో బిపిన్‌చంద్ర జోషి తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం గత నెల 28న ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే, దోషులు దాఖలు చేసిన అప్పీళ్లలో కొన్ని వాస్తవాలు, మరికొన్ని చట్టపరమైన అంశాలు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. బిల్కిస్‌ బానో కేసును విచారించిన బాంబే హైకోర్టు 2017లో వారికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు విధించిన జీవిత ఖైదును నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. వారి అరెస్టుకు దారితీసిన పరిస్థితులు, సుదీర్ఘకాలం జైల్లో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని ఇరువురికీ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజ ఠాక్రే మాత్రం బెయిల్‌ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘నాడు జరిగిన ఘోరం, విచారణ కోర్టు, బాంబే హైకోర్టులు ఒకే విధమైన తీర్పులు ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.


ఘటనకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించాలి. ఇది అత్యంత తీవ్రమైన ఘటన. పిటిసనర్లకు బెయిల్‌ ఇవ్వద్దు.’’ అని వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ.. నాటి ఘటనకు సంబంధించి నమోదైన ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌లో ఒకరి పేరు అసలు లేదని, ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత అతని పేరును చేర్చారని వివరించారు. బాధితురాలు సైతం వైద్యులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా వీరి పేర్లను పేర్కొనలేదన్నారు. ‘‘ఈ ఇద్దరిపై ప్రత్యక్షంగా ఎలాంటి ఆరోపణలు లేవు. ఘటన జరిగిన సమయంలో వారు గుంపులో ఉన్నారన్న ఆరోపణలతోనే కేసు పెట్టారు.’’ అని లూథ్రా వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ‘‘పిటిషనర్లు 17 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నారు. వారిలో ఒకరు(జోషి) తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ అప్పీలులో వాస్తవాలు, చట్టానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తాం.’’ అని పేర్కొంటూ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. బెయిల్‌ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.


నాడు ఏం జరిగింది?

2002, ఫిబ్రవరిలో గుజరాత్‌లో గోద్రా రైలు దహనం తర్వాత మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన 21 ఏళ్ల బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతి. అంతేకాదు.. ఆమె మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు కుటుంబ సభ్యులను దోషులు ఊచకోతకోశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని దోషులుగా గుర్తించి జీవిత ఖైదు విధించగా.. వీరిని 2024లో గుజరాత్‌ ప్రభుత్వం జైలు నుంచి ముందుగానే విడుదల చేయడం అప్పట్లో దుమారం రేపింది. ఈ వ్యవహారంపై బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు దోషులను తిరిగి జైలుకు పంపింది. అంతేకాదు, గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘కేసు విచారణ పరిధి మహారాష్ట్రలో ఉండగా శిక్షను మీరెలా తగ్గిస్తారు. దోషులతో కుమ్మక్కయినట్టు కనిపిస్తోంది.’’ అని మండిపడింది.

Updated Date - Nov 17 , 2026 | 02:45 AM