బిహార్‌లో గ్యాంగ్‌రేప్ బాధితురాలిపై మరో దాడి
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:10 AM
ఐదు నెలల క్రితం దారుణ అత్యాచారానికి గురైన వివాహిత(30)పై.. నిందితుల తరఫు వ్యక్తులు మరో విడత దాడికి పాల్పడ్డారు.
ఇంటిపై నుంచి కిందకు తోసేసిన నిందితులు
బాధితురాలికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఐదు నెలల క్రితం దారుణ అత్యాచారానికి గురైన వివాహిత(30)పై.. నిందితుల తరఫు వ్యక్తులు మరో విడత దాడికి పాల్పడ్డారు. ఇంటి పైనుంచి కిందకు తోసేయడంతో తీవ్ర గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో చోటుచేసుకుంది. చకియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన నివాసంలో బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో సోమవారం రాత్రి నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరితోపాటు, మరొక వ్యక్తి ఇంట్లోకి చొరబడి, బాధితురాలిని ఇంటిపైకి తీసుకెళ్లి కిందకు తోసేశారు. తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆస్పత్రికి అనంతరం.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన బొంగల్ కుమార్‌ను అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 11న బాధితురాలపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడగా దీనిపై కేసు కొనసాగుతోంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ నిందితులు అప్పటి నుంచి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీకి రావాలని కోరుతుండగా, అందుకు బాఽధిత కుటుంబం నిరాకరించడంతో ఇప్పుడీ దాడి జరిగింది.