పెళ్లాడతావా.. చస్తావా!
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:34 AM
పెళ్లంటే.. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. కోటి ఆశలతో, కొత్త కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతన్నామన్న ఆనందంలో వధూవరులు....
బిహార్‌లో మళ్లీ పెరుగుతున్న బలవంతపు వివాహాలు
చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న యువకులను
ఎత్తుకెళ్లి తలకు తుపాకీ గురిపెట్టి పెళ్లి చేసే ట్రెండ్
పెళ్లంటే.. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. కోటి ఆశలతో, కొత్త కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతన్నామన్న ఆనందంలో వధూవరులు! ఇది సాధారణంగా అన్నిచోట్లా జరిగే తంతు!! కానీ బిహార్ ఇందుకు భిన్నం. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు.. అన్నీ ఉంటాయిగానీ కొన్ని సందర్భాల్లో వరుడి ముఖంలో ఆనందం ఉండదు! చుట్టూ నిలబడిన వ్యక్తుల చేతుల్లోని తుపాకి గొట్టాల నుంచి ఏ క్షణంలో తూటాలు దూసుకొస్తాయో అన్న ఆందోళన మాత్రమే కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆ ఆందోళన కూడా ఉండదు. అసలు వరుడు స్పృహలోనే ఉండడు. పీటలపై మత్తులో తూగుతుంటాడు! బిహార్‌కు మాత్రమే పరిమితమైన ‘పకడ్వా వివాహ్’ తీరు ఇది. ‘పకడ్వా వివాహ్’ అంటే.. పట్టుకెళ్లిపోయి చేసే పెళ్లి.. అచ్చతెలుగులో బలవంతపు పెళ్లి అనొచ్చు. ఇలాంటి ఒక పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇటీవలికాలంలో బాగా వైరల్ అయ్యింది. పోలీసు కొలువు కోసం శ్రద్ధగా అభ్యాసం చేస్తున్న నితీశ్ కుమార్ అనే కుర్రాణ్ని కిడ్నాప్ చేసి.. అతడికి మత్తు ఇచ్చి పీటలపై కూర్చోబెట్టి పెళ్లి చేసేశారు. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఫిబ్రవరి 7న జరిగిందీ ఘటన. వివాహ తంతులో భాగంగా ‘వరమాల’ వేయాల్సిన వరుడు నితీశ్.. కనీసం తన చేతిని కూడా ఎత్తలేనంత మత్తులో ఉండగా, పక్కనున్న వ్యక్తి అతడి చేతుల్ని ఎత్తి వధువు మెళ్లో దండ వేయించాడు. పెళ్లి అయిపోయి, మత్తు దిగాక.. అసలేం జరిగిందీ నితీశ్ వివరంగా ఓ వీడియో విడుదల చేశాడు. ఆ రోజు తాను గ్రంథాలయానికి వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి తనను బలవంతంగా పట్టుకెళ్లి.. కొట్టి, మత్తు మందు ఇచ్చి మోర్వాలోని ఒక ఆలయానికి తీసుకెళ్లారని.. అక్కడ శంకర్‌రాయ్ అనే ఆయన కుమార్తె లక్ష్మీకుమారికి ఇచ్చి పెళ్లి చేశారని పేర్కొన్నాడు. పెళ్లయిన తర్వాత తనను వారి ఇంట్లోనే ఓ గదిలో ఉంచి, తాళం వేశారని తెలిపాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు స్పందించి అతణ్ని సురక్షితంగా వారి చెర నుంచి విడిపించారు.
నిరుడు నవంబరు నెలాఖరులో.. బిహార్‌లో ఒక స్కూల్ టీచర్ తలకు ఇలాగే తుపాకీ గురిపెట్టి బలవంతంగా పెళ్లి చేసిన వార్త బాగా వైరల్ అయ్యింది. నాడు ఆ స్కూల్ టీచర్‌కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన మామగారు కూడా పాతికేళ్ల క్రితం ఈ తరహా బలవంతపు పెళ్లి బాధితుడే! బిహార్‌లో చాలాకాలంగా ఉన్న ఈ ‘పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లిళ్ల)’ వ్యవహారం.. ఈ ఘటనలతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిహార్ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. 2020 జనవరి నవంబరు నెలల మధ్య ఈ తరహా బలవంతపు పెళ్లిళ్లు 7,194 నమోదయ్యాయి. నమోదు కాని కేసులు ఇంకా చాలానే ఉంటాయని అంచనా. అలాగే.. 2019లో 10.925 కేసులు, 2018లో 10, 310 కేసులు, 2017లో 8,972 కేసులు నమోదయ్యాయి. 2021 నుంచి పకడ్వా వివాహ్ కేసుల సంఖ్య అధికారికంగా లభ్యం కావట్లేదుగానీ.. వందల సంఖ్యలోనే జరుగుతున్నట్టు అంచనా. 2013లో బిహార్‌కు చెందిన రవికాంత్ అనే సైనికుడిని ఇలాగే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఓ మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. దీనిపై అతడు కేసు పెట్టి.. ఈ పెళ్లి చెల్లదంటూ హైకోర్టు దాకా వెళ్లాడు. హిందూ వివాహాల్లో అత్యంత ముఖ్యమైన సప్తపది జరగలేదు కాబట్టి.. అతడి తలకు తుపాకీ గురిపెట్టి చేసిన ఈ పెళ్లి చెల్లదంటూ అప్పట్లో పట్నా హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇదీ నేపథ్యం..
దేశంలో ఎక్కడా లేని బలవంతపు పెళ్లిళ్లు బిహార్‌లో ఎందుకు ఈ స్థాయిలో జరిగేవి? ఇప్పటికీ ఎందుకు అలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి అంటే.. వరకట్న సమస్య! ఈ సమస్యకు అసలు మూలాలు 1970ల్లో ఉన్నాయి. అప్పట్లో భూసంస్కరణలు అమల్లోకి రావడం.. సోషలిజం సిద్ధాంతాల వ్యాప్తి వల్ల భూస్వాముల హవా తగ్గడంతో బిహార్‌లోని బేగుసరాయ్ జిల్లాకు చెందిన చాలామంది భూస్వాముల పిల్లలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వోద్యోగాలపై దృష్టి సారించారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా సులభంగా ఉండేది. సర్కారీ నౌకరీ వచ్చినవారికి బాగా డిమాండ్ ఉండేది. వారు కూడా పెద్ద ఎత్తున కట్నాలు ఆశించేవారు. అంతంత కట్నాలు ఇచ్చుకోలేని ఆడపిల్లల తండ్రులు తొలినాళ్లలో... తమ కుమార్తెకు అన్నివిధాలా అర్హుడైన, ప్రభుత్వోద్యోగి అయున అబ్బాయిని ఎంచుకొని.. ఏదో శుభకార్యానికో, సమావేశంపేరుతోటో ఆహ్వానించి ఒకచోటికి రప్పించి అక్కడ అతడికి బలవంతంగా తమ కూతుర్ని ఇచ్చి కట్టబెట్టేసేవారు. దీన్ని గ్రహించిన అబ్బాయిలు జాగ్రత్త పడడంతో.. ఆడపిల్లల తల్లిదండ్రులు ‘ఆయుధాల’ను, అబ్బాయిలను ఎత్తుకురాగలిగే సామర్థ్యం ఉన్న ఆకురౌడీలను నమ్ముకొనే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ‘‘పెళ్లికొడుక్కి కట్నం ఇవ్వాలంటే రూ.లక్ష అవుతుంది. అదే.. రౌడీలకు రూ.10 వేలు ఇస్తే, అబ్బాయిని తెచ్చి మొత్తం పెళ్లి తంతు అంతా పూర్తయ్యేదాకా కాపలా కాస్తారు’’ అనే ఆలోచన మొదలైంది. అలా ఈ బలవంతపు పెళ్లిళ్ల దందా విస్తృతమైంది. - సెంట్రల్ డెస్క్
700 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం
బిహార్‌లోనే మధుబని జిల్లా సౌరాఠ్ సభ గ్రామంలో ఒక విచిత్రమైన మార్కెట్ ఉంటుంది. అది మైథిలీ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఏటా జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఏర్పాటుచేసే పెళ్లికొడుకుల మార్కెట్. ఆ మార్కెట్‌కి పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలంతా వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిల తండ్రులు, సోదరులు వచ్చి.. అక్కడ ఉన్న అబ్బాయిలందరినీ చూస్తారు. తమకు నచ్చిన అబ్బాయి మెడలో ఒక ఎర్ర శాలువా వేస్తారు. పెళ్లికి ఓకే అనుకుంటే.. ఇరువర్గాలవారూ కలిసి పంజీకార్ల వద్దకు వెళ్తారు. ఈ పంజీకార్ల వద్ద.. ఆ ప్రాంతంలోనిమైథిలీ బ్రాహ్మణుల పూర్వీకులకు సంబందించి వందల ఏళ్ల రికార్డులు ఉంటాయి. పెళ్లి చేసుకోబోయే జంట అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలనూ ఆ పంజీకార్లు పరిశీలిస్తారు. ఏడేడు తరాల్లో ఎక్కడా వీళ్లకీ, వాళ్లకీ రక్తసంబంధాలేవీ లేవని పంజీకార్ నిర్ణయిస్తేనే వారికి పెళ్లి చేస్తారు. 700ఏళ్లుగా ఈ ఆచారం ఉంది. ఒకప్పుడు ఈ మార్కెట్లలో అబ్బాయిలకు చదువు, ఉద్యోగం ఆధారంగా డిమాండ్ ఉండేది. ఒకరికంటే ఎక్కువ మంది ఒకే అబ్బాయిపై ఆసక్తి చూపితే.. వేలం కూడా నిర్వహించేవారని.. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారికి ఆ అబ్బాయి దక్కేవాడని చెబుతారు. ఇటీవలికాలంలో ఆ మార్కెట్ కళ తప్పింది.