Share News

శాసనమండలికి నితీశ్‌ రాజీనామా

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:00 AM

బిహార్‌ శాసన మండ లి సభ్యత్వానికి ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ సోమవారం రాజీనామా చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి...

శాసనమండలికి నితీశ్‌ రాజీనామా

  • ఏప్రిల్‌ 14 తర్వాత సీఎం పదవికి గుడ్‌బై!

పట్నా, మార్చి 30: బిహార్‌ శాసన మండ లి సభ్యత్వానికి ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ సోమవారం రాజీనామా చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బిహారీలు పవిత్రంగా భావించే ఖార్మాస్‌ నెల (ఏప్రిల్‌ 14వ తేదీన) పూర్తి అయిన తర్వాత నితీశ్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నితీశ్‌ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్‌డీఏలో భాగస్వామ్యపక్షాలైన బీజేపీ, జేడీయూల మధ్య కుదిరిన అవగాహన మేరకే.. నితీశ్‌ పెద్దల సభకు వెళ్తున్నారని, రాష్ట్ర పగ్గాలు బీజేపీకి చెందిన నేత చేపట్టనున్నారన్న విశ్లేషణలున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై, నితీశ్‌ పదోసారి సీఎంగా ప్రమాణం చేసి కేవలం 4 నెలలే అయ్యింది. కాగా, నితీశ్‌ రాజీనామా పట్ల ప్రజలు సంతోషంగా లేరని బిహార్‌ శాసన మండలి చైర్మన్‌ అవధేశ్‌ సింగ్‌ అన్నారు. నితీశ్‌ స్థానంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ బీసీ వర్గాల్లో ఒకటైన కాయ్రీ సముదాయానికి చెందిన సామ్రాట్‌ చౌదరికి సీఎం పదవిని అప్పగించటం ద్వారా.. ఆ వర్గం మద్దతు సంపాదించుకోవచ్చని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేసులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ పేరు కూడా వినిపిస్తోంది.

Updated Date - Mar 31 , 2026 | 05:00 AM