సాయుధ పోరాటంతో ఫలితం లేదు
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:45 AM
సాయుధ పోరాటం వల్ల ఫలితమేమీ ఉండదని మవోయిస్టు మాజీ నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అనుభవపూర్వకంగా తెలిపారు.
నక్సలైటు ఉద్యమం విఫలం: సీనియర్ నేత భూపతి
గడ్చిరోలి (మహారాష్ట్ర), ఫిబ్రవరి 19: సాయుధ పోరాటం వల్ల ఫలితమేమీ ఉండదని మవోయిస్టు మాజీ నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అనుభవపూర్వకంగా తెలిపారు. 43 ఏళ్లపాటు దండకారణ్యంలో గడిపి, ఒక్క గడ్చిరోలి జిల్లాలోనే తలపై 70కిపైగా క్రిమినల్ కేసులు ఉన్న ఆయన అక్టోబరు 15న 60 మంది సహచరులతో లొంగిపోయారు. గురువారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ నక్సలైటు ఉద్యమం విఫలమయిందని, మిగిలిన మావోయిస్టులందరూ దీన్ని గమనించాలని చెప్పారు. కామ్రేడ్లు ఒక్కొక్కరిగా చనిపోవడం తట్టుకోలేకే లొంగిపోయినట్టు తెలిపారు. దోపిడీ ఉన్నప్పుడు ప్రజలు విప్లవాల బాట పడుతారని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉందని చెప్పారు. తమ పోరాటం వ్యవస్థపైనే తప్ప పోలీసులపై కాదని స్పష్టం చేశారు. 2013 నుంచి గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలో కొత్తగా ఎవరూ చేరలేదని అన్నారు.