Share News

దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపు

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:09 AM

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో వీగిపోయేలా...

దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపు

  • నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్డీయే నిరసనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో వీగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఈ నిరసనల్లో పాల్గొంటాయి. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతాయి. మరోవైపు బిల్లు వీగిపోగానే ఎన్డీయే మహిళా ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. చట్ట సభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందకుండా రాహుల్‌ గాంధీ, ఇతర విపక్ష నేతలు అడ్డుకున్నారని, తద్వారా మహిళలకు అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ పూనమ్‌బెన్‌ ఆరోపించారు. దేశ మహిళలు రాహుల్‌ గాంధీని క్షమించబోరని చెప్పారు. కాంగ్రెస్‌, ఇండి కూటమి నేతలు స్వార్థ రాజకీయ కారణాలు చూపుతూ మహిళా సాధికారతను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌, ఇండి కూటమి నేతలు మహిళలను మోసగించారని చెప్పారు. మరోవైపు తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో దీనిపై ఉధృతంగా ప్రచారం చేయాలని, రానున్న మూడు వారాలు ఇదే అంశంపై విపక్షాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రె్‌సతో పాటు విపక్ష నేతల ఇళ్లను ఘెరావ్‌ చేయాలని కూడా బీజేపీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

Updated Date - Apr 18 , 2026 | 06:09 AM