‘భారత్ ట్యాక్సీ’ యాప్ వచ్చేస్తోంది
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:35 AM
దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా రెండు నెలల పాటు విజయవంతంగా కొనసాగిన ‘భారత్ ట్యాక్సీ’ యాప్ త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది..
నేడు అధికారికంగా ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా రెండు నెలల పాటు విజయవంతంగా కొనసాగిన ‘భారత్ ట్యాక్సీ’ యాప్ త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద క్యాబ్ అగ్రిగేటర్‌గా ఈ యాప్ నిలవనుందని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉబర్, ఓలా, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ నిలుస్తుందని పేర్కొంది. ఇది పూర్తిగా జీరో కమీషన్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తూ, లాభాలను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తుంది. డ్రైవర్లే యజమానులుగా పేర్కొంటూ వారికి షేర్ సర్టిఫికేట్లు అందజేస్తుంది. ఇందులో నమోదైన ప్రతి డ్రైవర్‌కు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ యాప్‌లో నమోదైన డ్రైవర్లకు ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కూడా పనిచేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.