Share News

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:52 AM

ఒక వైరల్‌ వీడియోను దృష్టిలో పెట్టుకుని సిక్కుల అత్యున్నత మత సంస్థ అకాల్‌ తఖ్త్‌ సోమవారం తనను గురు ద్రోహి, ఖల్సా పంత్‌ విరోధిగా ...

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు

  • పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌

చండీగఢ్‌, న్యూఢిల్లీ, జూన్‌ 16: ఒక వైరల్‌ వీడియోను దృష్టిలో పెట్టుకుని సిక్కుల అత్యున్నత మత సంస్థ అకాల్‌ తఖ్త్‌ సోమవారం తనను గురు ద్రోహి, ఖల్సా పంత్‌ విరోధిగా ప్రకటించడంతో పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ మంగళవారం స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని పేర్కొన్నారు. ఈమేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మత పెద్దలు తమ రాజకీయ బాస్‌ల సూచనల మేరకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వైరల్‌ వీడియోలో ఉన్నది తాను కాదని, అందులో ఉన్న వ్యక్తి ఎత్తు, శరీర సౌష్టవం తనతో సరిపోలదని అకాల్‌ తఖ్త్‌కు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అయినా తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కాగా గురుద్వారాలలో దక్షిణ పెట్టెలపై చేసిన వ్యాఖ్యలు, సిక్కు గురువులు, సిక్కు ఉగ్రవాది బింద్రన్‌వాలేల చిత్రాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని పంజాబ్‌ సీఎం మాన్‌ను అకాల్‌ తఖ్త్‌ ఈ ఏడాది జనవరిలో విచారణకు పిలిచింది. నాటి నుంచి ఈ వివాదం మొదలైంది. మరోవైపు తమను సంప్రదించకుండా గురు గ్రంథ్‌ సాహిబ్‌ను అవమానపరిచిన వారికి శిక్షలు విధించే చట్టాన్ని చేసినందుకు పంజాబ్‌కు చెందిన అందరు సిక్కు ఎమ్మెల్యేలు(అన్ని పార్టీల వారు) ఈ నెల 29న తమ ముందు హాజరుకావాలని అకాల్‌ తఖ్త్‌ ఆదేశించింది.

Updated Date - Jun 17 , 2026 | 03:52 AM