Share News

పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌కు రూ. 50వేల జరిమానా!

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:48 AM

పంజాబ్‌ ముఖ్యమంత్రి, భగవంత్‌మాన్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని షాక్‌ తగిలింది. ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనను కస్టమ్స్‌ అధికారులు ..

పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌కు రూ. 50వేల జరిమానా!

  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 3గంటల పాటు నిర్భంధం

  • లగేజీ తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు

న్యూఢిల్లీ, అక్టోబరు 21: పంజాబ్‌ ముఖ్యమంత్రి, భగవంత్‌మాన్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని షాక్‌ తగిలింది. ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనను కస్టమ్స్‌ అధికారులు దాదాపు మూడు గంటల పాటు నిలిపివేసి, జరిమానా విధించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సీఎం భగవంత్‌ మాన్‌ తన లగేజీలోని కొన్ని లగ్జరీ వస్తువులను డిక్లేర్‌ చేయడంలో విఫలమయ్యారన్న కారణంతో అధికారులు కస్టమ్స్‌ సుంకం విధించినట్లు వెల్లడించాయి. పంజాబ్‌ వ్యవసాయ, ఆహార శుద్ధి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రమోట్‌ చేసేందుకు భగవంత్‌మాన్‌ తన సిబ్బందితో కలిసి ఫ్రాన్స్‌ వెళ్లొచ్చారు. అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గ్రీన్‌ ఛానెల్‌ గుండా బయటకు వస్తున్న సమయంలో భగవంత్‌మాన్‌ను ఆపిన అధికారులు ఆయన సామగ్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిక్లేర్‌ చేయని కొన్ని లగ్జరీ వస్తువులు కనిపించడంతోనే కస్టమ్స్‌ డ్యూటీ కింద జరిమానా విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు, సీఎంపై కస్టమ్స్‌ చర్యలను ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. మాన్‌ ఫ్రాన్స్‌ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలోనే పర్యటన జరిగిందని ఆప్‌ నేత సౌరబ్‌ భరద్వాజ్‌ తెలిపారు. కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం ముఖ్యమంత్రిని విమానాశ్రయంలో నిర్భంధించిందని, ఇది పంజాబీలకు జరిగిన అవమానమని మండిపడ్డారు. కేంద్రం ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా ప్రవర్తించారని విమర్శించారు.

Updated Date - Oct 22 , 2026 | 05:50 AM