Share News

బీజేపీ వ్యతిరేకుల ఏరివేతకే ‘సర్‌’

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:18 AM

బీజేపీని వ్యతిరేకించే వారి ఓటు హక్కును హరించడమే లక్ష్యం గా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కింద ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు.

బీజేపీ వ్యతిరేకుల ఏరివేతకే ‘సర్‌’

  • ఓటు చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ .. సీఈసీ రాజీనామా చేయాలి: దీప్కే డిమాండ్‌

  • బెంగళూరు ఫ్రీడం పార్కులో హోరెత్తిన నిరసన

  • హాజరైన ప్రకాశ్‌ రాజ్‌, ధ్రువ్‌ రాఠీ తదితరులు

బెంగళూరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): బీజేపీని వ్యతిరేకించే వారి ఓటు హక్కును హరించడమే లక్ష్యం గా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కింద ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ బెంగళూరు ఫ్రీడం పార్కులో ‘జనతా న్యాయమండలి’ గురువారం నిర్వహించిన నిరసనసభలో ఆయన ప్రసంగించారు. ఓట్లను తొలగించడం, దొంగిలించడం ద్వారానే మోదీ ప్రధానమంత్రి అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ‘సర్‌’ ప్రక్రియను పూర్తిగా రద్దుచేయాలని, బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికలు జరపాలని దీప్కే డిమాండ్‌ చేశారు. సర్‌లో అక్రమాలకు బాధ్యత వహించి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసేవరకూ తమ పోరాటం ఆగదన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని తిరిగి సాధించుకునేందుకే తాము రోడ్డెక్కి పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై రోజుకొక ప్రాం తంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్వతంత్య్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. సర్‌ ముసుగులో కర్ణాటకలోని మొత్తం 5.5 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా కోటి మందిని తొలగించడం లేదా పక్కనపెట్టే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సర్‌ విషయంలో ఈసీకి పారదర్శకత, జవాబుదారీతనం శూన్యమని యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ ఆరోపించారు. ఈసీఈ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


పేదల ఓట్లను తొలగిస్తున్నారు: ప్రకాశ్‌రాజ్‌

ఓటరు జాబితా నుంచి పేదలు, ముస్లింలు, గిరిజనల ఓట్లను తొలగిస్తున్నారని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగించేంత అహంకారం ఎన్నికల సంఘానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేస్తే ఆ స్థానంలో మరో అజ్ఞానేశ్‌ వస్తారని, అందుకే సర్‌ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ధ్రువ్‌ రాఠీ, అశుతోశ్‌ రంకా, సౌరవ్‌ దాస్‌, ఆర్థిక నిపుణుడు పరకాల ప్రభాకర్‌, సాహితీవేత్త దేవనూరు మహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 05:19 AM