బెంగళూరు-పుణె మధ్య బుల్లెట్ రైల్ కారిడార్
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:05 AM
దేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్థం చేస్తోంది.
బెంగళూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): దేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్థం చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు-పుణె మధ్య బుల్లెట్ రైలు కారిడార్‌ను తదుపరి దశలో ప్రకటించే అవకాశముందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 3,000 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించనున్నట్టు తెలిపారు. బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్‌లో బెంగళూరు-ముంబై వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ప్రారంభించారు. అనంతరం అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఇప్పటికే ప్రతిపాదించిన మరో బుల్లెట్ రైలు కారిడార్‌కు ప్రధానమంత్రి ఆమోదం లభించిందన్నారు. ఈ మార్గం బెంగళూరు, హైదరాబాద్, అమరావతి, చెన్నై నగరాలను అనుసంధానించనుందని రైల్వే మంత్రి తెలిపారు. ఇది పూర్తయితే బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం రెండు గంటల 10 నిమిషాలు మాత్రమేనన్నారు.