Share News

దేశంలోనే అతిపెద్ద దోపిడీ?!

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:57 AM

కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో పరిధిలోని.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లాఘాట్‌లో రూ.400 కోట్లు ఉన్న రెండు కంటైనర్లు దోపిడీకి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేశంలోనే అతిపెద్ద దోపిడీ?!

  • 400 కోట్ల నగదు ఉన్న 2 కంటైనర్లు మాయం!!

  • కర్ణాటకలోని బెళగావి పరిధిలో ఘటన

బెంగళూరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో పరిధిలోని.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లాఘాట్‌లో రూ.400 కోట్లు ఉన్న రెండు కంటైనర్లు దోపిడీకి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో అసలు.. ఈ నగదు ఎవరిదనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఇదే నిజమైతే దేశంలో ఇంత పెద్ద దారి దోపిడీ ఇదేకావచ్చు. ఈ దోపిడీపై నాసిక్‌కు చెందిన సందీప్‌ దత్త పాటిల్‌ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు మహారాష్ట్ర పోలీసులు వివరాల కోసం తమకు లేఖ రాశారని, దీంతో తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని బెళగావి ఎస్పీ రామరాజన్‌ ఆదివారం మీడియాకు తెలిపారు. ‘గత అక్టోబరు 16న విరాట్‌గాంధీ అనే వ్యక్తి ఆదేశాలతో విశాల్‌నాయుడు, మరికొందరు తనను కిడ్నాప్‌ చేసినట్లు సందీప్‌ దత్త అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్‌ పరిధిలో గల ఘోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నాసిక్‌లో కేసు నమోదైంది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్‌ ఎస్పీ నుంచి మాకు ఒక లేఖ వచ్చింది. దాని ద్వారానే భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమగ్ర దర్యాప్తునకు మేము ప్రత్యేక బృందాన్ని నాసిక్‌కు పంపించాం. అయితే, దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర సిట్‌ బృందం.. మా పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదు. అలాగే, భారీ ఎత్తున నగదు కంటెయినర్లలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంలోనూ స్పష్టత లేదు. దోపిడీ జరిగినట్లు చెబుతున్న ప్రాంతం గోవా, మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దుగా ఉంది. మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేయాల్సి ఉంది. గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు సదరు నగదు రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నగదు ముంబై-థానె ప్రదేశంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిశోర్‌శెట్టికి చెందినదిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోవాకు చెందిన బాలాజీ ట్రస్టు అనే ధార్మిక సంస్థకు చెందినదిగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో జయేశ్‌ కదం, విశాల్‌నాయుడు, సునిల్‌దుమాల్‌, విరాట్‌గాంధీ, జనార్ధనథాయ్‌ గుడెను నిందితులుగా నాసిక్‌ పోలీసులు గుర్తించారు. ఇటీవలే విరాట్‌ గాంధీని అరెస్టు చేసినట్లు నాసిక్‌ రూరల్‌ ఏఎస్పీ ఆదిత్యమిర్ఖేల్కర్‌ మాకు సమాచారం ఇచ్చారు. కేసులో పలు అనుమానాలు ఉన్నాయి. దేనిపైనా స్పష్టత లేదు. దోపిడీకి గురైన సొమ్ము నిజంగా రూ.400 కోట్లో కాదో స్పష్టత లేదు. కానీ, ఈ దోపిడీ బెళగావి జిల్లా పరిధిలో జరిగినట్టు నిర్ధారణ అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు చేస్తాం. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం’ అని బెళగావి ఎస్పీ వివరించారు. కాగా, ఆ నగదు రద్దయిన రూ.2వేల నోట్లుగా ప్రచారం జరుగుతోంది. రద్దయిన నోట్లే అయితే, అవి చెల్లవు గనుక, కేసే ఉండదని కొందరు చెబుతుండగా, దీనివెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 26 , 2026 | 03:57 AM