Share News

బీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:10 AM

బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని, ఆ తర్వాతే మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలని అఖిలపక్ష పార్టీల నాయకులు, ఓబీసీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని సంయుక్తంగా...

బీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాల్సిందే

  • చిన్నచూపు చూస్తే మా తడాఖా చూపిస్తాం

  • బీసీ మహిళల ప్రాతినిధ్యం లేని బిల్లును ఒప్పుకోం

  • కులగణన తర్వాతే డీలిమిటేషన్‌ అమలు చేయాలి

  • ఢిల్లీలో బీసీ మహిళల పోరు దీక్షలో నేతల హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని, ఆ తర్వాతే మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలని అఖిలపక్ష పార్టీల నాయకులు, ఓబీసీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని సంయుక్తంగా డిమాండ్‌ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జంతర్‌మంతర్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మణిమంజరి అధ్యక్షతన గురువారం బీసీ మహిళల పోరు దీక్ష నిర్వహించారు. దీక్షకు ఎంపీలు బీద మస్తాన్‌రావు, అంబికా లక్ష్మీనారాయణ, వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ అనిల్‌ జైహింద్‌, వి.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం బీసీలను మరో 80 సంవత్సరాలు రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు మహిళా బిల్లులో జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించకపోతే దేశంలో అగ్గి పుట్టిస్తామని, భారత్‌ బంద్‌ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల డిమాండ్లను, దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను ప్రధాని మోదీ గౌరవించి, బీసీ మహిళలకు అండగా నిలబడాలని ఆయన కోరారు. కులగణన చేస్తామని మాట ఇచ్చి నేడు జరుగుతున్న దేశవ్యాప్త జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకపోవడం, 2011 జనాభా లెక్కల ప్రతిపదికన కేంద్రం ముందుకు సాగడం బీసీల గొంతు కోయడమేనని ధ్వజమెత్తారు. కులగణన తర్వాతే డీలిమిటేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌ రావు, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ పార్టీ ఎన్డీఏలో భాగమైనప్పటికీ, బీసీల తరఫున పోరాడుతామని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించే విషయమై చంద్రబాబుతో మాట్లాడుతామన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు కేసిన శంకరరావు మాట్లాడుతూ బీసీలపై వివక్ష చూపడం మోదీకి తగదని అన్నారు. బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మణి మంజరి, బీఆర్‌ఎస్‌ నేత దాసరి ఉష మాట్లాడుతూ మహిళా బిల్లుపై ఉన్న చిత్తశుద్థి బీసీ మహిళల సబ్‌ కోటాపై ఎందుకు లేదని కేంద్రాన్ని నిలదీశారు బీసీ మహిళలకు సబ్‌ కోటా సాధించే వరకు ఢిల్లీలోనే ఉంటామని, అవసరమైతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Updated Date - Apr 17 , 2026 | 03:10 AM