నేల సరిగ్గా కనిపించకే బారామతిలో విమాన ప్రమాదం
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:52 AM
విమానం నుంచి రన్ వే సరిగ్గా కనిపించకపోవడమే మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: విమానం నుంచి రన్ వే సరిగ్గా కనిపించకపోవడమే మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. జనవరి 28న జరిగిన ఈ విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా నలుగురు మరణించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) శనివారం విడుదల చేసింది. విజిబిలిటీ సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండడమే ప్రమాదానికి కారణమని తెలిపింది. రన్‌వేపై రంగుతో రాసిన గీతలు చెరిగిపోవడం, కంకర రాళ్లు తేలడం వల్ల కూడా పైలట్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టి ఉంటాయని అభిప్రాయపడింది. విజిబిలిటీ మార్కర్లు కనీసం 5,000 మీటర్లు (5 కి.మీ.) మేర కనిపించాల్సి ఉండాల్సి ఉండగా, ఆ రోజున 3,000 మీటర్ల వరకే ఉన్నట్టు బారామతిలోని టవర్ నుంచి పైలట్‌కు సమాచారం అందింది. రన్‌వేపై 2016లో తారు పూయడం వంటి రీ-కార్పెటింగ్ పనులు చేయగా, ఆ తరువాత మళ్లీ చేయలేదని దాంతో రంగులతో రాసిన గుర్తులు చెరిగిపోయి కంకరరాళ్లు తేలినట్టు నిర్ధారించింది. ఆ విమానం ఒక ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి ముంబయి చేరుకున్న అనంతరం తనిఖీలు జరగగా, టెక్నీషియన్‌కు ఎలాంటి అసాధారణ లోపాలు కనిపించలేదని తెలిపింది.