బంగ్లాఎన్నికల్లో..మైనారిటీల వైపు ఎవరు?
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:59 AM
కల్లోల బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 300 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు మొదలుపెట్టి..
రేపే పోలింగ్.. బీఎన్‌పీ, జమాతే ఇస్లామీ మధ్యే పోటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కల్లోల బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 300 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు మొదలుపెట్టి.. శుక్రవారంనాటికి ఫలితాలు ప్రకటిస్తారు. మహ్మద్ యూనస్ సారథ్యంలో నడుస్తున్న ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో.. ఏ పార్టీని అధికారంలోకి తేవాలో బంగ్లాదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో నిర్ణయించనున్నారు. బంగ్లాదేశ్‌లో 8ు హిందువులు ఉండగా, గడిచిన 2-3 నెలలుగా హిందువులపై దాడులు పెరిగాయి. ఈ తరుణంలో.. బంగ్లా ఎన్నికల సరళిని భారత ప్రభుత్వం, ఇక్కడి నేతలు, రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీగా ఉన్న హిందువుల పట్ల ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో, ఏ పార్టీ తమ మ్యానిఫెస్టోలో ఈ రెండు అంశాలపై ఏం చెప్పిందో చూస్తున్నారు. మనదేశంలోలాగానే బంగ్లాదేశ్‌లో కూడా లెక్కకు మిక్కిలిగా పార్టీలున్నప్పటికీ.. 2024 దాకా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ, ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ప్రధాన పార్టీలుగా ఉండేవి. వీటిలో అవామీలీగ్ పార్టీతోనే గత 15 ఏళ్లుగా భారత్ సత్సంబంధాలు కలిగి ఉంది. అయితే, 2024లో బంగ్లాలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా షేక్‌హసీనా పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ స్థానాన్ని జమాతే ఇస్లామీ భర్తీ చేసింది. దీంతో ప్రస్తుతం బీఎన్‌పీ, జమాత్ పార్టీల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ రెండింటిలోనూ.. జమాతే ఇస్లామీ పార్టీతో పోలిస్తే ఖలీదాజియా కుమారుడు తారీఖ్‌రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీనే కాస్త ఉదారవాద, ప్రజాస్వామిక ప్రత్యామ్నాయంగా మన ప్రభుత్వం పరిగణిస్తోంది. ‘‘మేం గెలిస్తే బంగ్లాదేశ్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. ఇతర దేశాలు మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించదు’’ అని ఆయన ఒక సభలో పేర్కొన్నారు. అలాగే.. ‘‘మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీ కాదు, పిండీ (రావల్పిండి) కాదు.. మాకు బంగ్లాదేశే అన్నింటికన్నా ముందు’’ అని తారీఖ్ రెహమాన్ పదేపదే చెబుతున్నారు. అంటే.. యూనస్ మార్గానికి భిన్నంగా, ఇరు దేశాలకూ సమానదూరం పాటించే విధానం. మరోవైపు.. జమాతే ఇస్లామీ పార్టీ తన మ్యానిపెస్టోలో ఢిల్లీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, భారత్‌తో స్నేహ, సహకార సంబంధాలు కలిగి ఉంటామని ప్రకటించింది. అయితే, జమాతే పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పనుపున పనిచేసే సంస్థ అనే ఆరోపణలు ఆ పార్టీపై ఉన్నాయి. 1971యుద్ధంలో పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు పలికిన ఆ పార్టీ.. హసీనా హయాంలో నిషేధాన్ని కూడా ఎదుర్కొంది. అందుకే ఆ పార్టీపై బంగ్లాదేశ్ హిందువులకు పెద్దగా నమ్మకం లేదు.