Share News

బద్రీనాథ్‌ హైవేపై కూలిన కొండచరియలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:49 AM

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆదివారం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

బద్రీనాథ్‌ హైవేపై కూలిన కొండచరియలు

  • 10వేల మందికి పైగా చిక్కుకున్న యాత్రికులు

  • వారిలో 40 మంది తెలుగువారు

  • చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

డెహ్రాడూన్‌, సెప్టెంబర్‌ 27: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆదివారం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని శిరోబాగఢ్‌ వద్ద భారీగా రాళ్లు, మట్టి కూలి రహదారిపై పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. 10వేల మందికిపైగా యాత్రికులు ఇరువైపులా వాహనాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అందులో 40 మంది తెలుగు యాత్రికులు కూడా ఉన్నట్టు సమాచారం. రహదారిపై శిధిలాలను తొలగించేందుకు యంత్రాలను మోహరించారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. తొలగించే కొద్దీ.. వర్షాలకు కొండపై నుంచి ఎప్పటికప్పుడు మట్టి, రాళ్లు జారిపడుతున్నాయి. దీంతో చార్‌ధామ్‌ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో బద్రీనాథ్‌ రహదారిపై ఏటా శిరోబాగఢ్‌ వద్ద కొండచరియలు విరిగిపడడం సహజమే. సదరు ప్రాంతాన్ని అత్యంత సున్నితమైనదిగా చెబుతారు. మరోవైపు తెహ్రీ, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, పౌరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

Updated Date - Sep 28 , 2026 | 05:51 AM