రక్తహీనతకు ఆయుర్వేదంతో చెక్..!
ABN , Publish Date - May 22 , 2026 | 03:41 AM
రక్తహీనత చికిత్సకు అందించే రెండు రకాల ఆయుర్వేద మందులు.. ప్రామాణికమైన ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లకు సమానంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది.
ఐరన్-ఫోలిక్ యాసిడ్‌కు సమానంగా ఆయుర్వేద చికిత్స విధానాలు
ఐసీఎంఆర్, సీసీఆర్‌ఏఎస్
సంయుక్త అధ్యయనంలో గుర్తింపు
న్యూఢిల్లీ, మే 21: రక్తహీనత చికిత్సకు అందించే రెండు రకాల ఆయుర్వేద మందులు.. ప్రామాణికమైన ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లకు సమానంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి (సీసీఆర్‌ఏఎస్) సంయుక్తంగా నిర్వహించిన ఫేజ్ 3 ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ (ఆర్‌సీటీ)లో ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో రక్తహీనతను ఆయుర్వేద మందులతో కూడా నివారించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతతో బాధపడుతున్న మహిళలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో.. రెండు ఆయుర్వేద చికిత్స విధానాలు.. అల్లోపతి ఐరన్-ఫోలిక్ యాసిడ్‌కు సమానమైన చికిత్స ఫలితాలను అందించాయని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలను బుధవారం నిర్వహించిన ఐసీఎంఆర్ మొదటి వార్షిక క్లినికల్ ట్రయల్ మీట్‌లో సమర్పించారు. మధ్యస్థ రక్తహీనత సమస్యతో బాధపడుతున్న 18-49 ఏళ్ల మధ్య వయసున్న గర్భవతులు కాని 4000 మందిపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 90 రోజులపాటు వారి హిమోగ్లోబిన్ స్థాయిలు, ఇతర క్లినికల్ ఫలితాలను అంచనా వేశారు. ఈ క్రమంలో రెండు ఆయుర్వేద చికిత్సా విధానాలు ఐరన్-ఫోలిక్ యాసిడ్ మందులకు సమానమైన చికిత్స సామర్థ్యాన్ని చూపించినట్టు నిరూపితమైందని వారు తెలిపారు.