అయోధ్య రామాలయం విరాళాల దోపిడీ కేసులో వాదించం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:22 AM
అయోధ్య రామాలయం దోపిడీ కేసులో నిందితుల తరఫున వాదించకూడదని యూపీలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం
ట్రస్ట్ పెద్దలు అయోధ్య వీడాలని హెచ్చరిక
ఆకాశమే ఊడి మీద పడదులే..
‘అయోధ్య’పై అత్యవసర విచారణను కోరిన పిటిషనర్‌తో సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూన్ 29: అయోధ్య రామాలయం దోపిడీ కేసులో నిందితుల తరఫున వాదించకూడదని యూపీలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తీర్మానాన్ని ఉల్లంఘించి నిందితుల తరఫున ఎవరైనా వాదిస్తే... వారికి రూ.5లక్షల జరిమానా విధించాలని కూడా నిర్ణయించారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ పెద్దలు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులు మూడు రోజుల్లోగా అయోధ్యను విడిచి వెళ్లాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేదంటే నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. కాగా, కానుకల చోరీ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాతే ఈ అంశంపై విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ‘అంత అత్యవసరం ఏముంది? ఆకాశమేం ఊడి మీద పడదులే..’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్ దాఖలు చేశారు. మరోవైపు.. రామ మందిరం కేసులో అరెస్టయిన 8 మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.