Share News

రాముడి సొమ్ముతో విల్లాలు, విలాసాలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:06 AM

అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఏకంగా రూ.6 నుంచి రూ.8 లక్షల మధ్య రాముడి సొమ్ము...

రాముడి సొమ్ముతో విల్లాలు, విలాసాలు

  • నిత్యం రూ.6-8 లక్షలు నొక్కేసిన వైనం

  • అయోధ్య విరాళాల పక్కదారిలో వెలుగులోకి సంచలన విషయాలు

  • రూ.5 కోట్ల రామచరిత్‌ మానస్‌ పుస్తకం కూడా మాయం?

లక్నో, న్యూఢిల్లీ జూలై 5: అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఏకంగా రూ.6 నుంచి రూ.8 లక్షల మధ్య రాముడి సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంక్‌ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాలు వెలుగుచూడక ముందు వరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ బ్యాంక్‌ ఖాతాకు రోజూ రూ.16-18 లక్షలు వరకు జమయ్యేవి. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా రూ.24-26 లక్షలకు పెరిగినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది నిందితుల్లో ఐదుగురు అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించడం తెలిసిందే. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్సులో దాచేసి, పక్కదారి పట్టించడం గమనార్హం. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమితులైన వీరు, భక్తుల కానుకలను బాగానే బుక్కేసి ఉంటారని తెలుస్తోంది. సిట్‌ నివేదిక ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నప్పటికీ ఇందులోని కొన్ని సంచలన విషయాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా బయటకు వచ్చాయి. నిందితుల్లో ఒకరైన ఔట్‌సోర్స్‌ ఉద్యోగి అవినాష్‌ శుక్లా.. ఆలయంలో కానుకల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగిగా నియమితుడు కాక ముందు వరకు హనుమాన్‌ గుహ వద్ద తాగునీటి విక్రయ కేంద్రం నిర్వహించే వాడని తెలిసింది. శనివారం రాత్రి అతడినుంచి అయోధ్య పోలీసులు మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీని సీజ్‌ చేశారు. మరో నిందితుడైన లవ్‌కుష్‌ మిశ్రా గతేడాది అక్టోబర్‌ 16న బనీపూర్‌ ప్రాంతంలో 1,000 చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. రిజిస్టర్డ్‌ విలువ రూ.8లక్షలే ఉన్నప్పటికీ, మార్కెట్‌ విలువ రూ.25లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మరో నిందితుడైన రామ్‌ శంకర్‌ అలియాస్‌ టిన్ను గతంలో డ్రైవర్‌గా పనిచేయగా, విరాళాల సొమ్ముతో ఒక హాస్టల్‌ను తెరిచినట్టు తెలిసింది.


బంగారు రామచరిత్‌ ఏమైంది?

అయోధ్య శ్రీరాముడికి భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలు, విరాళాల్లో అసలు ఎన్ని భద్రంగా ఉన్నాయి? ఎన్ని బకాసురుల జేబుల్లోకి వెళ్లాయన్నది? ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. బంగారంతో చేసిన రూ.5కోట్ల విలువ చేసే రామచరిత మానస్‌ కూడా కనిపించడం లేదన్న విషయం వెలుగు చూసింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.లక్ష్మీనారాయణ దీన్ని శ్రీరాముడి భవ్య మందిరానికి 2024 ఏప్రిల్‌లో విరాళంగా అందించారు. తొలుత కొంత కాలం పాటు ఆలయంలో భక్తుల కోసం ప్రదర్శించగా, ఆ తర్వాత నుంచి అది కనిపించడం లేదంటూ ఆయన తాజాగా బయట పెట్టారు. ఈ విషయమై ఆలయ అధికారుల నుంచి స్పష్టత కోరినప్పటికీ ఫలితం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. ‘‘రామచరిత్‌ మానస్‌ అన్నది దివంగత నా మాతృమూర్తికి రాముడి పట్ల ఉన్న భక్తికి నిదర్శనం. ఆమె తన జీవితంలో 15-18 ఏళ్లు రామ నామం రాయడంలోనే గడిపారు. అప్పటివరకు భక్తుల కోసం ప్రదర్శించిన రామచరిత్‌ మానస్‌ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడమేంటి?’’అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. బంగారం పూతతో చేసిన 522 పేజీలతో కూడిన ఈ పుస్తకం బరువు 147 కిలోలు. తయారీకి బంగారంతోపాటు వెండి, రాగిని వాడారు.

సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారించాలి

అయోధ్య రామాలయం విరాళాలను పక్కదారి పట్టించిన అంశంలో బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ పై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. ఓటు చోరీ, సీటు చోరీ, చందాల చోరీ అనే మూడు సూత్రాల వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపణలు గుప్పించారు. అయోధ్య రామాలయం నిర్మాణం, ప్రారంభోత్సవ ఘనతను తమ ఖాతాలో వేసుకున్న మోదీ, అమిత్‌షా.. ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు.

రాజకీయ నేతల ఆరోపణల నిగ్గు తేల్చండి: వీహెచ్‌పీ

రామాలయ విరాళాల చోరీపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న సంచలన ఆరోపణల్లోని నిజంపాళ్లను తేల్చాలంటూ అయోధ్య పోలీసులను విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) లేఖ ద్వారా కోరింది. రూ.20,000వేల కోట్ల అక్రమాలు అంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొంది. ద్వేష, శత్రుత్వ భావనలు సృష్టించాలని ఆరోపణలు చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అయోధ్య డీఎ్‌సపీ అశుతోష్‌ తివారీకి లేఖ రాశారు.

Updated Date - Jul 06 , 2026 | 03:06 AM