Share News

గొగోయ్‌ దంపతులు పాకిస్థాన్‌ ఏజెంట్లు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:33 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాజకీయ ఆరోపణలు దేశ సరిహద్దులు దాటాయి.

గొగోయ్‌ దంపతులు పాకిస్థాన్‌ ఏజెంట్లు

  • అసోం కాంగ్రెస్‌ చీఫ్‌పై సీఎం హిమంత శర్మ తీవ్ర ఆరోపణలు

గువాహటి, ఫిబ్రవరి 8: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాజకీయ ఆరోపణలు దేశ సరిహద్దులు దాటాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గౌరవ్‌ గొగోయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌ కోల్‌బర్న్‌ పాకిస్థాన్‌ ఏజెంట్లు అని సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్‌బర్న్‌ కార్యకలాపాలపై దర్యాప్తు జరిపేందుకు అస్సాం ప్రభుత్వం నియమించిన సిట్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను ఆదివారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌కు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కోల్‌బర్న్‌ పాకిస్థాన్‌కు చేరవేసినట్లు సిట్‌ విచారణలో తేలిందని తెలిపారు. ‘కోల్‌బర్న్‌ భారత్‌కు రాకముందు లీడ్‌ పాకిస్థాన్‌ అనే సంస్థలో పాకిస్థాన్‌లో పనిచేశారు. ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అలీ తౌఖీర్‌ షేక్‌ అనే వ్యక్తి పాక్‌ ప్రణాళికా సంఘం మాజీ సలహాదారు. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎ్‌సఐతో అతనికి సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తితో గౌరవ్‌ గొగోయ్‌, ఆయన భార్యకు లోతైన సంబంధాలు ఉన్నాయని తేలింది. కోల్‌బర్న్‌ లీడ్‌ ఇండియా సంస్థకు బదిలీ అయ్యి భారత్‌కు వచ్చారు. అప్పుడు కూడా ఆమె షేక్‌ నుంచి జీతం తీసుకున్నారు. భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కుచెందిన సున్నితమైన సమాచారం ఉన్న 45 పేజీల రిపోర్టును ఆమె షేక్‌కు పంపారు. గౌరవ్‌ గొగోయ్‌ కూడా 2013లో అత్యంత రహస్యంగా పాకిస్థాన్‌లో 10 రోజులు పర్యటించారు. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి దీనిని కేంద్ర సంస్థలే దర్యాప్తు చేయాలి. ఆ మేరకు కేంద్ర హోంశాఖకు సిఫారసు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’ అని సీఎం హిమంత తెలిపారు. గొగోయ్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలని లేదంటే దేశద్రోహ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం మీడియా సమావేశం నిర్వహిస్తుండగానే గౌరవ్‌ గొగోయ్‌ ఎక్స్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ‘సీఎం ప్రెస్‌మీట్‌ సూపర్‌ ప్లాప్‌ అయిన సీ గ్రేడ్‌ సినిమా కంటే దరిద్రంగా ఉంది. సీఎం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. సీఎం, ఆయన కుటుంబం దాదాపు 4 వేల ఎకరాల భూమిని ఆక్రమించినట్లు మా జ్గోమోయ్‌ పరివర్తన్‌ యాత్రలో బయటపెట్టాం. దానిని కప్పిపుచ్చేందుకే సీఎం ఈ ఆరోపణలు చేస్తున్నారు’ అని గౌరవ్‌ గొగోయ్‌ ఆరోపించారు.

Updated Date - Feb 09 , 2026 | 01:33 AM