Share News

చందమామ చెంతకు ఆర్టెమిస్‌-2

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:45 AM

నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్‌ వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రానికి..

చందమామ చెంతకు ఆర్టెమిస్‌-2

  • భూమి నుంచి రికార్డుస్థాయి దూరానికి చేరుకున్న ఓరియన్‌ వ్యోమనౌక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్‌ వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రానికి చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి వెళ్లింది. అర్ధరాత్రి 12.15 గంటల సమయానికి అది చంద్రుడి ఆవలివైపునకు చేరుకుని.. ఇప్పటివరకూ ఏ మానవసహిత వ్యోమనౌకా ప్రయాణించనంత (4,06,772 కిలోమీటర్ల) దూరానికి వెళ్లింది. 1970లో చేపట్టిన అపోలో 13 మిషన్‌లో భాగంగా అప్పటి వ్యోమగాములు ప్రయాణించిన దూరం (4,00,171 కిలోమీటర్ల) కన్నా అధికం ఇది. ఆ సమయంలో వారికి, భూమికి చంద్రుడు అడ్డుగోడగా మారడంతో సాంకేతిక సంబంధాలు తెగిపోయాయి(ఇది ముందుగా ఊహించిందే). నౌకలోని వ్యోమగాములు.. ఇంతవరకూ నరమానవులెవరూ చూడని చంద్రుడి అవతలివైపును (వీపును అనొచ్చేమో?) చూశారు. ఆ పాయింట్‌ నుంచి.. ఓరియన్‌ వ్యోమ నౌక మళ్లీ భూమి దిశగా దూసుకు రావడం ప్రారంభించింది. తిరిగి వచ్చే సమయంలో ఓరియన్‌ వేగం గంటకు 40,200 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అదీ ఒక రికార్డే. ఇప్పటిదాకా.. మానవులతో కూడిన ఏ వ్యోమనౌకా అంత వేగంతో తిరిగి రాలేదు. ఆ సమయంలో ఓరియన్‌ హీట్‌ షీల్డ్‌ 2760 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది.

Updated Date - Apr 07 , 2026 | 04:45 AM