Share News

లోయలో పడిన ఆర్మీ వాహనం

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:07 AM

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 21మంది జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం....

లోయలో పడిన ఆర్మీ వాహనం

  • 10 మంది సైనికుల మృతి

  • మరో 11 మందికి తీవ్ర గాయాలు

  • కశ్మీర్‌లోని దోడా జిల్లాలో దుర్ఘటన

జమ్మూ/భదేర్వాహ్‌, జనవరి 22: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 21మంది జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ‘కాస్పెర్‌’ అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కు వెళుతుండగా భదేర్వాహ్‌-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఉన్న 9వేల అడుగుల ఎత్తులోని ఖన్నీ టాప్‌ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన సంభవించింది. విపరీతంగా మంచు కురుస్తుండడంతో రోడ్డు పైనుంచి జారిన వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో పక్కనున్న లోయలోకి పడిపోయింది. వెంటనే ఆర్మీ, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని జవాన్లను బయటకు తీసుకొచ్చారు. నలుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా.. తీవ్రం గా గాయపడిన 17 మందిని భదేర్వాహ్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. 10మందిని హెలికాప్టర్‌లో ఉధంపూర్‌ కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు. భదేర్వాహ్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మరో జవాను పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మందుపాతరలు, ఐఈడీల పేలుడు ధాటిని సైతం తట్టుకోలిగేలా, ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన ఈ కాస్పెర్‌ వాహనం ప్రమాదంలో ధ్వంసమైంది. ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణా లు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పది మంది సాహసవంతులైన సైనికులను కోల్పోవడం కలచివేస్తోందని, దేశానికి వారు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని మోదీ, రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:07 AM