లారీని ఢీకొన్న ఆర్మీ అంబులెన్స్ నలుగురి మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:21 AM
విధి నిర్వహణలో కన్నుమూసిన సైనికుడి పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం ఆర్మీ అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తుండగా.. అది అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు మరణించారు.
సైనికుడి పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం
యూపీలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘటన
సుల్తాన్‌పూర్, అక్టోబరు 4: విధి నిర్వహణలో కన్నుమూసిన సైనికుడి పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం ఆర్మీ అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తుండగా.. అది అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. సైనికుడి కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు అంబులెన్స్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్‌లో సుబేదార్ మేజర్ సత్యవాన్ మృతి చెందగా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆర్మీ అంబులెన్స్‌లో ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాలోని సొంతూరుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా అదుపు తప్పిన అంబులెన్స్.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జవాన్ కుమారుడు గౌరవ్‌సింగ్, అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ జవాన్ తమ్ముడు, మేనల్లుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.