‘ఆవుకు జాతీయ జంతువు హోదా’ ప్రతిపాదన లేదు: అర్జున్ మేఘ్వాల్
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:14 AM
దేశవ్యాప్తంగా గోవధను నిషేధించడంతో పాటు ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించే ప్రతిపాదనలేవీ కేంద్రం పరిశీలనలో లేవని ...
న్యూఢిల్లీ, మే 31: దేశవ్యాప్తంగా గోవధను నిషేధించడంతో పాటు ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించే ప్రతిపాదనలేవీ కేంద్రం పరిశీలనలో లేవని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. అయితే, గోవధపై సంపూర్ణ నిషేధం విధించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయని, సోషల్ మీడియా సహా అన్నిచోట్లా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోందని మేఘవాల్ అంగీకరించారు. మరోవైపు, న్యాయమూర్తుల నియామకం విషయంలో కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య ఎటువంటి ఘర్షణ లేదని అర్జున్ మేఘవాల్ స్పష్టం చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం, కొలీజియం మధ్య నిరంతర సంభాషణ, మంచి సంప్రదింపుల ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పేర్లతో కొన్నిసార్లు కొలీజియం విభేదించవచ్చని, అలాగే ప్రతికూల తనిఖీ నివేదికలు, ఇతర కారణాలతో ప్రభుత్వ కూడా కొన్ని సిఫారసులను నిలిపివేయవచ్చని, వీటిని విభేదాలుగా పరిగణించలేమని పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంపై ఆయన స్పందిస్తూ.. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అయితే వాటిని అధ్యయనం చేయడానికి అధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు.