AR Rahman Clarifies Comments: ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:59 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
భారత్ నాకు స్ఫూర్తి.. నా గురువు.. నా ఇల్లు
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివరణ
న్యూఢిల్లీ, జనవరి 18: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని, కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నానని అన్నారు. భారత్ తనకు స్ఫూర్తి, ఇల్లు అని, భారతీయుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు రెహమాన్ ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. దానికి తాను కంపోజ్ చేసిన ‘మా తుఝే సలాం.. వందేమాతరం’ గీతాల క్లిప్స్‌ను జతపరిచారు. ఈ వీడియోలో, ‘‘సంగీతం అనేది ఎల్లప్పుడూ మన సంస్కృతిని అనుసంధానించేందుకు, వేడుక చేసుకునేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉంటుందని నేను విశ్వసిస్తాను. భారత్ నాకు స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. భారతీయుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తాను. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే, భిన్నస్వరాలతో పనిచేసే అవకాశాన్ని ఈ దేశం నాకు కల్పించింది. ఒక్కోసారి మన ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాను. కానీ, ఎప్పటికీ సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయడమే నా లక్ష్యం. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని రెహమాన్ అన్నారు.