Music director AR Rahman: నాకు పని దొరక్కపోవడానికి మతమే కారణమేమో!
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:38 AM
సినీరంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్‌గా నన్ను ఎంపిక చేశాక కూడా వేరేవాళ్లతో సంగీతం
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
న్యూఢిల్లీ, జనవరి 17: సినీరంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం ‘ఛావా’కు సంగీతం అందించిన రెహమాన్, ఆ చిత్రం గురించి, అలాగే బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బీబీసీ ఏషియన్ నెట్‌వర్ ్కకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. ‘ఛావా ఒక విభజనవాద చిత్రం. సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకొని ఈ సినిమా సొమ్ము చేసుకుందని నేను భావిస్తున్నాను. కానీ, ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్ గురించి తీస్తున్న సినిమాకు పని చేయడం గౌరవంగా భావించి అంగీకరించాను. కానీ సినిమాలో ‘సుభాన్ అల్లా, అల్హమ్దులిల్లా’ వంటి పదాలను ప్రతికూల సందర్భాల్లో వాడడం నాకు ఎబ్బెట్టుగా తోచింది. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో నాకు పెద్దగా పని దొరకడం లేదు. బహుశా దీనికి మతపరమైన కారణాలు ఉండొచ్చు. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉంది. సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరేవాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలున్నాయి’ అని తెలిపారు.
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: కంగన
రెహమాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ తదితరులు రెహమాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డియర్ రెహమాన్.. నేను కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని సినీ పరిశ్రమలో ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నాను. కానీ, మీ అంత పక్షపాత, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో కంగన మండిపడ్డారు. సినిమా విభజనవాదాన్ని ప్రేరేపిస్తుందని తెలిసినప్పుడు, అందులో పనిచేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారని వినోద్ బన్సల్ ప్రశ్నించారు. ‘ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు సరిపోతాయి.. కళాకారులకు కాదు. ఒకప్పుడు హిందువు అయిన రెహమాన్, మళ్లీ హిందూ ధర్మంలోకి పునరాగమనం చేస్తే పని దొరుకుతుందేమో’ అని వ్యాఖ్యానించారు. ‘బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందనేది అవాస్తవం. షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ అగ్రహీరోలుగా కొనసాగుతున్నారు. రెహమాన్ చాలా పెద్ద స్థాయి వ్యక్తి. చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు. అంతే తప్ప మతపరమైన కారణాలు లేవు’ అని జావేద్ అక్తర్ అన్నారు.