బాల్ పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - May 28 , 2026 | 05:25 AM
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ - 2027 కోసం బాల బాలికల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌టిఆర్ జిల్లా మహిళాభివృద్ధి....
విజయవాడ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ - 2027 కోసం బాల బాలికల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌టిఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిణి షేక్ రుక్సానా సుల్తానా బేగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాపితంగా ప్రతి ఏడాది బాలల ప్రతిభను గుర్తించడం ద్వారా వారిని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలను అందిస్తోందని ఈ సందర్భంగా ఉదహరించారు. ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు మరియు సంస్కృతి, విజ్ఞానం సాంకేతికత ఇలా 6 రంగాలలో ఇప్పటికే ప్రతిభ ఉన్న బాల బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వచ్చే జులై 31వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవలన్నారు. 5 సంవత్సరాలు పైబడి, 18 సంవత్సరాలు మించని బాలలు దరఖాస్తుకు అర్హులన్నారు. దరఖాస్తులు http://award.gov.in ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్ధలు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం గురించి విస్తృత ప్రచారం చేయాలని ఆమె కోరారు.