‘అంత్యోదయ’లో ఇక ఒక్కో వ్యక్తికి 7 కిలోలే!
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:47 AM
నిరుపేదలకు ఆహార ధాన్యాలను అందజేసే ‘అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)’లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనుంది.
రేషన్‌లో మార్పులకు కేంద్రం యోచన
న్యూఢిల్లీ, జూన్ 25: నిరుపేదలకు ఆహార ధాన్యాలను అందజేసే ‘అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)’లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఇకపై 7 కిలోల బియ్యం/గోధుమలు ఇచ్చేలా మార్పు చేయబోతోంది. ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కింద నిరుపేద కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా 35 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్నారు. ఇకపై ఒక్కో వ్యక్తికి 7 కిలోలంటే పేదలకు అందించే ఆహార ధాన్యం కోటాను తగ్గించినట్లే. అయితే, కుటుంబానికి 35 కిలోల గరిష్ఠ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించాలనుకుంటోంది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం- 2013ను సవరించాలని యోచిస్తోంది. ఈ అంశంపై జూలై 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. కొత్త విధానంలో అంత్యోదయ కార్డుదారులు ఒకవేళ కుటుంబంలో ఇద్దరే ఉంటే వారికి 14 కిలోలు మాత్రమే లభిస్తాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నా 35 కిలోలే ఇస్తారు. ప్రతి వ్యక్తికి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందించడమే ఈ సవరణ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.