‘అధికారా’నికి ఎదురుదెబ్బ!
ABN , Publish Date - May 05 , 2026 | 06:23 AM
ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడిన ప్రధాన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు మూడు చోట్లా అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది.
3 రాష్ట్రాల్లో ఓడిన అధికార పార్టీలు
ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ప్రజలు మార్పు కోరుకుంటుండటమే కారణం
న్యూఢిల్లీ, మే 4: ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడిన ప్రధాన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు మూడు చోట్లా అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అంశం స్పష్టంగా ప్రతిఫలించింది. కేరళ, బెంగాల్‌లలో గతంలో ప్రతిపక్షాలుగా నిలిచిన పార్టీలు ఈసారి బంపర్ మెజారిటీతో అధికారాన్ని అందుకుంటుంటే.. అధికార పార్టీలు ప్రతిపక్ష స్థానానికి వెళుతున్నాయి. ఇక తమిళనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడే అధికారం.. ఈసారి టీవీకే పార్టీని వరించింది.
పశ్చిమబెంగాల్‌లో తారుమారు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఘన విజయం సాధించింది. మొత్తం 294 స్థానాలకుగాను 215 సీట్లు గెలుచుకుని బంపర్ మెజారిటీ పొందింది. 48శాతం ఓట్లు సాధించింది. బీజేపీ 38.1 శాతం ఓట్లతో 77 స్థానాలను గెలుచుకుంది. వరుసగా మూడుసార్లు సీఎంగా ఉన్న మమతా బెనర్జీపై, తృణమూల్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, బీజేపీ దూకుడుతో ఈసారి పరిస్థితి తారుమారైంది. బీజేపీ సుమారు 46శాతం ఓట్లతో 208 స్థానాల్లో విజయం సాధించగా.. టీఎంసీ 40.8 శాతం ఓట్లతో 79 స్థానాలకే పరిమితమైంది.
తమిళనాడులో దోబూచులాటకు బ్రేక్
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగాను గత ఎన్నికల్లో డీఎంకే 37.7శాతం ఓట్లతో 133 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే 33.3 శాతం ఓట్లతో 66 సీట్లు సాధించి ప్రతిపక్షంలో నిలిచింది. ప్రస్తుతం అత్యధిక స్థానాలు సాధించిన విజయ్ టీవీకే పార్టీ గత ఎన్నికల నాటికి ఇంకా ఉనికిలో లేదు. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే 24.2 శాతం ఓట్లతో 60 స్థానాలకే పరిమితమైంది. అన్నాడీఎంకే 21.2 శాతం ఓట్లతో 47 సీట్లు సాధించింది. కొత్తగా వచ్చిన విజయ్ టీవీకే పార్టీ సుమారు 35 శాతం ఓట్లతో ఏకంగా 107 సీట్లు సాధించింది.
కేరళలోనూ అధికార పార్టీకి దెబ్బ..
కేరళలో గత ఎన్నికల్లో 41.5 శాతం ఓట్లతో 99 సీట్లు సాధించి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి 38.4శాతం ఓట్లతో 41సీట్లు సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. ఈసారి పరిస్థితి తిరగబడింది. అధికార ఎల్‌డీఎఫ్ కూటమి సుమారు 30శాతం ఓట్లతో 35సీట్లకే పరిమితమైంది. యూడీఎఫ్ కూటమి సుమారు 44శాతం ఓట్లతో 102 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.