ఆంత్రోపిక్ సేవలు.. ఇక దేశీయ సర్వర్ల ద్వారానే!
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:18 AM
చాట్‌జీపీటీ, జెమినై, గ్రోక్, క్లాడ్ వంటి ఏఐ మోడళ్లని మనం ఏదైనా ప్రశ్న అడిగితే.. ఆ ప్రశ్నను ఎక్కడో అమెరికాలో ఉన్న సర్వర్లు ప్రాసెస్ చేసి, దానికి సమాధానం ఇస్తాయి. కానీ.. భారతీయ చట్టాలకు లోబడి తమ ఏఐ మోడళ్లు ఇక నుంచి డేటాను భారత్‌లోనే ప్రాసెస్ చేస్తాయని, ఇందుకోసం తాము అమెజాన్ బెడ్‌రాక్ ద్వారా ‘లోకల్ ఇన్‌ఫరెన్స్’ సేవలను ప్రారంభించామని ఆంత్రోపిక్ సంస్థ సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 5: చాట్‌జీపీటీ, జెమినై, గ్రోక్, క్లాడ్ వంటి ఏఐ మోడళ్లని మనం ఏదైనా ప్రశ్న అడిగితే.. ఆ ప్రశ్నను ఎక్కడో అమెరికాలో ఉన్న సర్వర్లు ప్రాసెస్ చేసి, దానికి సమాధానం ఇస్తాయి. కానీ.. భారతీయ చట్టాలకు లోబడి తమ ఏఐ మోడళ్లు ఇక నుంచి డేటాను భారత్‌లోనే ప్రాసెస్ చేస్తాయని, ఇందుకోసం తాము అమెజాన్ బెడ్‌రాక్ ద్వారా ‘లోకల్ ఇన్‌ఫరెన్స్’ సేవలను ప్రారంభించామని ఆంత్రోపిక్ సంస్థ సోమవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు అనుగుణంగా లోకల్ డేటా ప్రాసెసింగ్ నిబంధనలు పాటించాలని భారతీయ సంస్థలు సూచించిన నేపథ్యంలో ఆంత్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఇచ్చిన హామీ మేరకు లోకల్ ఇన్‌ఫరెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆంత్రోపిక్ ఎండీ (ఇండియా) ఇరినా ఘోస్ తెలిపారు. కాగా.. చాట్‌జీపీటీని అభివృద్ధి చేస్తున్న ‘ఓపెన్ ఏఐ’ సంస్థలో.. కృత్రిమ మేధ భద్రతకు సంబంధించి నివేదికలు రూపొందించే విభాగాధిపతి డేవిడ్ రాబిన్సన్ రాజీనామా చేశారు. ఓపెన్ ఏఐ సంస్కృతి దెబ్బతిందని.. ఏఐ సంస్థలు కృత్రిమ మేధను అభివృద్ధి చేసే క్రమంలో తగినన్ని జాగ్రత్తలు పాటించట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ మోడళ్లపై ముందు జాగ్రత్తలు తీసుకోవడం కంటే.. కొత్త ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం, వ్యాపారపోటీపైనే ఏఐ సంస్థలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే ముప్పులను అంచనా వేసే పరిశోధన బృందాలకు సరైన స్వేచ్ఛ ఇవ్వట్లేదని.. వారికి ప్రాధాన్యం లభించట్లేదని ఆవేదన వెలిబుచ్చారు.