ఉద్యోగాలపై ఏఐ పంజా!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:07 AM
తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది! ఆ కథేంటంటే.. అమెరికాకు చెందిన ‘ఆంత్రోపిక్’ అనే కృత్రిమ మేధ స్టార్టప్ సంస్థ..
పని ప్రదేశాల్లో ఉత్పాదకత పెంచే 11 ప్లగిన్స్‌ను విడుదల చేసిన అమెరికన్ ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’
పెద్ద సంఖ్యలో సిబ్బంది ఎక్కువ సమయం వెచ్చించి చేసే పనిని కొన్నిగంటల్లో చేసే సత్తా వాటి సొంతం
వాటి దెబ్బకు యూరప్, అమెరికా దేశాల్లో సాఫ్ట్‌వేర్
సేవలు అందించే కంపెనీల షేర్లు భారీగా పతనం
మనదేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలపైనా ఆ ప్రభావం
4-7 ు మేర పడిపోయిన ఆయా కంపెనీల షేర్లు
ఈ తరహా ఏఐ టూల్స్ వల్ల భవిష్యత్తులో భారీగా
ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళన
...తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది! ఆ కథేంటంటే.. అమెరికాకు చెందిన ‘ఆంత్రోపిక్’ అనే కృత్రిమ మేధ స్టార్టప్ సంస్థ.. తాను అభివృద్ధి చేసిన ‘క్లాడ్ కోవర్క్’ అనే ‘ఏఐ వర్క్‌ప్లేస్ ఏజెంట్’ పనితీరును పెంచే 11 ప్లగిన్స్‌ను జనవరి 30న విడుదల చేసింది. పని ప్రదేశంలో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడమే వీటి లక్ష్యం. ఈ ప్లగిన్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఏఐ కూడా మన సహోద్యోగిగా మారినట్టే! చాట్‌బాట్లలాగా కేవలం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో సరిపెట్టకుండా.. మనం ఇచ్చే పనిని స్వీకరించి, టూల్స్ వాడి దానిని పూర్తిచేస్తుంది. ఉదాహరణకు.. ఒక సంస్థ ఏదైనా కొత్త కాంట్రాక్టు కుదుర్చుకోవాలంటే ముందుగా ఈ టూల్‌కి ఆ డ్రాఫ్ట్‌ని ఇచ్చి రిస్క్ ఎనాలసిస్ చేయమని అడిగితే చేసి పెడుతుంది. సంస్థ పాలసీలతో పోల్చి, రిస్క్‌లను గుర్తించి, అవసరమైతే సంస్థ లాయర్‌కు ఆ సమస్యలను నివేదిస్తుంది. ప్రస్తుతం ఈ పని చేయడానికి పలువురు జూనియర్ లాయర్లు, కొన్ని రోజులు కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ‘లీగల్’ అనే ప్లగిన్‌సాయంతో ‘క్లాడ్ కోవర్క్’ ఈ పనిని కొన్ని గంటల్లో పూర్తిచేయగలదు. ఈ వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ ప్లగిన్స్‌సత్తా తెలియడంతో.. అమెరికా, యూరప్ దేశాలకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలతోపాటు మనదేశానికి చెందిన దిగ్గజ ఐటీ సంస్థల షేర్లూ పడిపోయాయి. కృత్రిమ మేధ రంగంలో నానాటికీ వేగంగా జరుగుతున్న ఈ తరహా అభివృద్ధి కారణంగా.. సంప్రదాయ ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలు అందించే సేవల ప్రాధాన్యం తగ్గిపోతుందన్న భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే ఈ పతనానికి కారణం. ఒక్క ఏఐ కంపెనీ విడుదల చేసిన వర్క్‌ప్లేస్ ప్రొడక్టివిటీ టూల్స్‌తోనే ఈ స్థాయి నష్టం జరిగితే.. ఏఐ దెబ్బ భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉండనుందో అర్థం చేసుకోవచ్చు.
పాత పనే.. ఆలోచించి..
మీరొక లేఖ టైప్ చేయాలనుకున్నారు. ఒక 30-40 ఏళ్ల క్రితమైతే ఇందుకు టైప్ రైటర్లు వాడేవారు! చేతి రాతతో రాసిన లేఖల కన్నా మెరుగే అయినా.. దానికి చాలా పరిమితులు ఉండేవి. మైక్రోసాఫ్ట్ సంస్థ విండో్‌సను, ఎంఎస్ ఆఫీస్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాక.. టైపింగ్ సులువైంది. టైపింగ్‌లో తప్పులు దొర్లినా ‘బ్యాక్‌స్పేస్’ ఉపయోగించి ఆ తప్పును సులువుగా సరిచేసుకునే వీలు కుదిరింది. ‘స్పెల్ చెకర్’, ‘గ్రామర్ చెకర్’ లాంటి టూల్స్ వాడి వ్యాకరణ దోషాలు కూడా లేకుండా లేఖలు రాసే వీలు కలిగింది. ఇది ఇన్నాళ్లుగా మనందరికీ తెలిసిన వ్యవహారం. ఇవన్నీ మన పనిలో సహాయపడే ఉపకరణాలు మాత్రమే. ఇవేవీ సొంతంగా ఆలోచించలేవు. అంటే.. ఎవరికి లేఖ రాయాలి? ఎలా రాయాలి? ఏ పదాలు వాడాలి? ఇదంతా మనమే ఆలోచించాలి. టూల్స్ మనకు సహాయం మాత్రమే చేస్తాయి. కానీ.. ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన టూల్స్ ఆలోచించి పనిచేస్తాయి. దానికి ఇచ్చిన పనిని అర్థం చేసుకుంటుంది. విశ్లేషిస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ నుంచి వచ్చిన లేఖను ఆంత్రోపిక్ ఏఐ టూల్‌కి ఇచ్చి.. దానికి సమాధానం రాయాలని కోరితే సులువుగా రాసిపెడుతుంది. వెయ్యిపేజీలున్న లీగల్ డాక్యుమెంట్‌ను చదివి.. సారాంశం చెప్పమంటే చెబుతుంది. డాక్యుమెంట్‌ను చదివి.. రిస్క్ ఎనాలిసిస్ చేయాలని అడిగితే చేసి పెడుతుంది. ఇలా పనిని సులభతరం చేసే 11ప్లగిన్స్‌ను ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసింది.
ఇవన్నీ ఓపెన్‌సోర్స్ ప్లగిన్స్. అంటే.. ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐని వాడే ఏ కంపెనీ అయినాఈ 11 ప్లగిన్స్‌నూ ఉచితంగా వాడుకోవచ్చు. ఒక్కొక్కటీ ఒక్కో పనిచేస్తుంది.ఉదాహరణకు.. ‘ప్రొడక్టివిటీ’ అనే ప్లగిన్ వాడి.. మన రోజువారీ పనులను చక్కబెట్టుకోవచ్చు. ‘ఎంటర్‌ప్రైజ్ సెర్చ్’ అనే ప్లగిన్ వాడి కంపెనీ టూల్స్‌లో (ఈమెయిల్/చాట్/డాక్యుమెంట్ల) సెర్చ్ చేయొచ్చు. అంటే మన కంపెనీ ఈమెయిల్ వ్యవస్థలో ఒక నిర్ణీత మెయిల్‌ను సెర్చ్ చేయాలంటే ఈ టూల్‌ను వాడితే సరిపోతుంది. ‘సేల్స్’ ప్లగిన్‌తో.. సేల్స్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ సులువవుతుంది. ‘ఫైనాన్స్’ ప్లగిన్‌తో.. అకౌంటింగ్ వర్క్ ఫ్లోస్‌ను, ఆర్థిక నివేదికలను తయారుచేసుకోవచ్చు. వీటన్నింటిలోనూ.. అత్యంత కీలకమైనది, బుధవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదేలు చేసింది.. ‘లీగల్’ ప్లగిన్. సాధారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు లాయర్లకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను విక్రయిస్తుంటాయి. వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడీ ప్లగిన్‌తో ఆయా కంపెనీలకు పని తగ్గిపోతుంది. కాంట్రాక్టులను సమీక్షించడం, లీగల్ డాక్యుమెంట్ల పరిశీలన వంటి కీలకమైన పనులు చేయడానికి ఆయా కంపెనీల్లో పెద్ద సంఖ్యలో జూనియర్ లాయర్లు ఉంటారు. అలాంటి పదిమంది జూనియర్ లాయర్లు రోజులతరబడి చేసే పనిని ఆంత్రోపిక్ ‘లీగల్’ ప్లగిన్ ఒంటిచేత్తో కొన్ని గంటల్లో చేయగలుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. లాయర్ల పనిని ఆంత్రోపిక్ సంస్థ ఏఐతో చేయిస్తుండడంతో యూర్‌పలోని పలువురు పెట్టుబడిదారులు.. ‘ఇక ఈ కంపెనీలకు భవిష్యత్తు లేదు’ అనే ఆందోళనతో ఆయా సంస్థల షేర్లు అమ్మేశారు. ఆ ప్రభావమే అమెరికాపైన, లీగల్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (ఎల్‌పీవో), కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్ల రివ్యూ చేసిపెట్టే మన టెక్ దిగ్గజ కంపెనీలపైనా పడింది. మార్కెట్లు పడిపోవడానికి ప్రస్తుతానికి ఈ ‘లీగల్’ ప్లగినే కారణమైనప్పటికీ.. భవిష్యత్తులో సేల్స్, మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, డేటా క్లీనింగ్, అకౌంటింగ్, ఆడిట్, ఫైనాన్స్, హెల్త్ వంటి రంగాల్లోనూ ఏఐ విశ్వరూపం దాల్చే అవకాశం ఉంది. అప్పుడు భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. పది మంది చేసే పనిని.. ఏఐ సాయంతో ఇద్దరే చేయగలిగే రోజులు వస్తాయి. అప్పుడు ఏఐతో పనిచేయించగలిగేవారికిమాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. అలాగే.. ‘సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్’ సేవలు అందించే కంపెనీల(ఉదాహరణకు జోహో వంటివి)పైనా ఏఐ టూల్స్ ప్రభావం పడనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
- సెంట్రల్ డెస్క్