వైట్ కాలర్ ఉగ్ర గ్రూపు!
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:08 AM
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన డాక్టర్లు అందరూ...
‘అన్సార్ ఇంటెరిమ్’ పేరుతో ఏర్పాటు చేసిన ‘ఉగ్ర’ డాక్టర్లు
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు
న్యూఢిల్లీ/శ్రీనగర్, ఫిబ్రవరి 15: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన డాక్టర్లు అందరూ ‘అన్సార్ ఇంటెరిమ్’ అనే కొత్త ఉగ్రవాద గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్‌లో అరెస్టయిన డాక్టర్లందరూ 2016 నుంచి ర్యాడికలైజ్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ‘అన్సార్ ఇంటెరిమ్’ గ్రూపు ద్వారా జమ్ముకశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాల్లో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలనేది వారి లక్ష్యమని విచారణలో ఆ డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. క్రియాశీల ఉగ్రవాదులతో తమకున్న సంబంధాలన్నీ తెగిపోయినందున కొత్త గ్రూపు ఏర్పాటు చేయాల్సి అవసరం ఏర్పడిందని వారు వెల్లడించారు. నిందిత డాక్టర్లు ముజమిల్ గన్నీ, ఉమన్ ఉన్ నబీ, ఆదిల్, అతని సోదరుడు ముజఫర్‌తో పాటు మౌల్వీ ఇర్ఫాన్, కారీ అమీర్, తుఫైల్ ఘాజీలు 2022లో శ్రీనగర్‌లోని ఓ ఈద్గాలో సమావేశమయ్యారని ఓ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో ‘అన్సార్ ఇంటెరిమ్’ గ్రూపును ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆదిల్‌ను చీఫ్‌గా నియమించుకున్నారు. మౌల్వీ ఇర్ఫాన్‌ను డిప్యూటీ చీఫ్‌గా, గన్నీ ట్రెజరర్‌గా అనుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
2023 నుంచి ఫెర్టిలైజర్ల కొనుగోలు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రూపు 2023లో పేలుళ్లకు అవసరమైన ఫెర్టిలైజర్లను హరియాణాలోని సోహ్నా, నుహ్‌లలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఉమర్ సూచనల మేరకు, ఫరీదాబాద్‌లోని ఓ కెమికల్ దుకాణం నుంచి ఎన్‌పీకే (పొటాషియం నైట్రేట్)ను కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. ఇక, ఆదిల్ కొత్త ఉగ్ర గ్రూపులో సభ్యుల కోసం వేట కొనసాగించాడు. ఈ క్రమంలో దక్షిణ కశ్మీర్‌కు చెందిన డానిష్ అనే వ్యక్తిని ఫరీదాబాద్‌లోని అల్‌ఫలాహ్ యూనివర్సిటీలోని ఒక అద్దె రూమ్‌కు తీసుకొచ్చాడు. అక్కడ ఉమర్, గన్నీ టీఏటీపీ పేలుడు పదార్థాలను తయారు చేయడం వారిద్దరూ చూశారు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడికి ఒప్పించడానికి డాని్‌షను ఉమర్ ప్రయత్నం చేశాడు. అతను ఒప్పుకోకపోవడంతో పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడి చేశాడు.