ఊపేస్తున్న అన్నామలైఉద్యమం
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:59 AM
తమిళనాట మరో రాజకీయ సంచలనానికి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తెర తీశారు. ‘వుయ్ ద పీపుల్’ పేరుతో ఆయన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపే...
పిలుపిచ్చిన 24 గంటల్లోనే 14 లక్షలమంది చేరిక
చెన్నై, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): తమిళనాట మరో రాజకీయ సంచలనానికి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తెర తీశారు. ‘వుయ్ ద పీపుల్’ పేరుతో ఆయన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపే సుమారు 14 లక్షలమంది ఆ ఉద్యమానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. బీజేపీ అధిష్ఠానం అన్నామలై రాజీనామాను ఆమోదించిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో ప్రజల ముందుకెళ్లి తన రాజకీయ ఉద్యమం గురించి వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం అంటూ తన కార్యాచరణను ప్రకటించారు. మరోవైపు, బీజేపీ నుంచి కొందరు అన్నామలై ప్రారంభించిన ఉద్యమంలోకి తెలిసో తెలియకో తొందరపడి చేరారని, వారంతా ఎప్పుడైనా పార్టీకి తిరిగి రావచ్చునని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాగేంద్రన్ తెలిపారు. ‘‘అన్నామలై ఉద్యమంలో మా పార్టీకి చెందిన కొంత మంది ఇన్‌చార్జులు, క్షేత్రస్థాయి నాయకులు కూడా చేరినట్లు తెలుసుకున్నాను. తిరిగి వచ్చేయాలని వారందరినీ కోరుతున్నాను.’’ అని తెలిపారు. తన ఉద్యమానికి ప్రధాని మోదీ ఆశీస్సులున్నట్లు అన్నామలై ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉన్నదని నాగేంద్రన్ వ్యాఖ్యానించారు.