Share News

అండమాన్‌లో పడవ మునిగి 250 మంది గల్లంతు

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:26 AM

బతుకుదెరువు కోసం సముద్ర మార్గంలో మలేషియాకు వెళ్తున్న వలసదారుల పడవ అండమాన్‌ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయింది.

అండమాన్‌లో పడవ మునిగి 250 మంది గల్లంతు

ఢాకా, ఏప్రిల్‌ 15: బతుకుదెరువు కోసం సముద్ర మార్గంలో మలేషియాకు వెళ్తున్న వలసదారుల పడవ అండమాన్‌ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మయన్మార్‌కు చెందిన రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశీయులు సహా సుమారు 250 మందికి పైగా గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) శరణార్థి, వలస సంస్థలు మంగళవారం వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ జిల్లా టెక్నాఫ్‌ తీరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో ఒక ట్రాలర్‌ మలేషియాకు బయలుదేరింది. అయితే, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతి కారణంగా పడవ నియంత్రణ కోల్పోయి మునిగిపోయిందని యూఎన్‌ సంస్థలు తెలిపాయి. కాగా, ఈనెల 9న అటుగా వెళ్తున్న ‘ఎమ్‌. టి. మేఘనా ప్రైడ్‌’ అనే బంగ్లాదేశ్‌ నౌక సిబ్బంది సముద్రంలో తేలుతున్న తొమ్మిది మందిని(ముగ్గురు రోహింగ్యాలు, ఆరుగురు బంగ్లాదేశీయులు) రక్షించినట్లు బంగ్లా కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి బుధవారం మీడియాతో చెప్పారు. ప్రస్తుతం గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌లో వేధింపులు, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లోని దారుణమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి రోహింగ్యాలు తరచుగా ఇలాంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు చేస్తుంటారు.

Updated Date - Apr 16 , 2026 | 03:26 AM