అనంత్‌నాగ్‌కు ఫాల్కే
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:14 AM
ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు, ఐదు దశాబ్దాలకు పైగా తన సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో చెరగని ముద్రవేసిన అనంత్‌నాగ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
కన్నడ నట దిగ్గజానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
ఈ నెల 22న గుజరాత్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
అభినందనలు తెలిపిన మోదీ
300కు పైగా చిత్రాల్లో నటన
1980ల్లో వచ్చిన ధారావాహిక ‘మాల్గుడి డేస్’తో ఖ్యాతి
న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు, ఐదు దశాబ్దాలకు పైగా తన సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో చెరగని ముద్రవేసిన అనంత్‌నాగ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానం, భారత చలనచిత్ర రంగానికి ఆయన చేసిన కృషికిగాను అత్యున్నతమైన ఫాల్కే పురస్కారం దక్కింది. అవార్డు కమిటీ సిఫారసు మేరకు కేంద్రం 2024 సంవత్సరానికిగాను ఆయనకు బుధవారం ఈ అవార్డును ప్రకటించింది. 22న గుజరాత్‌లోని కేవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో అనంత్‌నాగ్‌కు రాష్ట్రపతి ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. 1948 సెప్టెంబరు 4న అప్పటి ముంబై ప్రెసిడెన్సీ ప్రాంతం, ప్రస్తుత కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా భట్కళ్ తాలూకా శిరాలిలో అనంత్‌నాగ్ జన్మించారు. ఆయన అసలుపేరు అనంత్ నాగరకట్టె. 1973లో ఆయన సంకల్ప అనే కన్నడ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. 300 పైగా సినిమాల్లో నటించారు. ఇందులో 250 సినిమాలు కన్నడవే. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మళయాళం, ఇంగ్లిషు సినిమాల్లోనూ నటించారు. కన్నేశ్వర రామ, గోది బణ్ణ సాధారణ మైకట్టు, రాజకుమార, గాలిపటం-2, కేజీఎఫ్ వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. రాత్రి, ప్రేమలేఖలు, అనుగ్రహం, శంఖారావం, భీష్మ, బాలు వంటి తెలుగు చిత్రాల్లోనూ ఆయన నటించారు.
ఆర్కే నారాయణ్ కథల ఆధారంగా చిత్రీకరణ జరిగి, దూరదర్శన్‌లో ప్రసారమై, గొప్ప ప్రేక్షకాదరణ పొందిన ధారావాహిక ‘మాల్గుడి డేస్’లో అనంత్ నాగ్ మిఠాయివాలా పాత్రతో తనదైన ముద్రవేశారు. 2007లో కన్నడ రాజ్యోత్సవ అవార్డు, 2025లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. కాగా, అనంత్‌నాగ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆయన అత్యంత ప్రతిభగల అపురూపమైన కళాకారుడని, దశాబ్దాలుగా కన్నడ, భారతీయ సినిమా రంగానికి సేవలందించారని ఎక్స్‌లో కొనియాడారు. ఓ విశిష్ట కళాకారుడికి ఈ పురస్కారం ద్వారా నిజమైన గౌరవం దక్కిందన్నారు.